శ్రీశైలం ఏరియల్‌ఫ్యూ
సున్నిపెంటలో 2,250 గృహాల నిర్మాణానికి జీఓ
శ్రీశైలం: తిరుమల తిరుపతి తరహాలో శ్రీశైలం దేవస్థానాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా శ్రీశైలం నివాసితుల గృహాలను సున్నిపెంటకు తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా గృహాలను నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఈ మేరకు జీఓ 18 విడుదల చేశారు. గత ఏడాది అక్టోబర్ 26న ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ దేవస్థానాల అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో శ్రీశైలంలో ఎలాంటి నివాసిత గృహాలు ఉండరాదని, తిరుమల–తిరపతి తరహాలో శ్రీశైలం–సున్నిపెంటలను అభివృద్ధి చేయాలని సూచించారు.
దేవస్థానం వ్యాప్తంగా ఉన్న గృహాల తరలింపుపై సర్వే చేపట్టి ఎంత మందికి పునరావాసం కల్పించాలనే విషయమై చర్చించారు. ఇందులో భాగంగా ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు సున్నిపెంటలో ఎన్‌టిఆర్ గృహకల్ప పథకం ద్వారా గృహాల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా శ్రీశైలదేవస్థానం పరిధిలో సుమారు 2250 గృహాలలో స్థానికులు నివాసం ఉంటుండగా, వీరందరికీ సున్నిపెంటలో పునరావాసం కల్పించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను దేవస్థానం కల్పించాల్సి ఉంటుంది. గృహాల నిర్మాణం హౌసింగ్ కార్పొరేషన్ పని కాగా.. రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, వీధిలైట్లు మొదలైనవి దేవస్థానమే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. రెవెన్యూ దేవాదాయశాఖ, జిల్లా కలెక్టర్.. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టాలని జీఓలో పేర్కొన్నారు.
సున్నిపెంటలో 75 ఎకరాల స్థలం గుర్తింపు
గృహాల నిర్మాణానికి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి, రెవెన్యూ అధికారులు ఇప్పటికే సున్నిపెంటలో 75 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. హౌసింగ్ కార్పొరేషన్ రెండు సెంట్ల స్థలంలో ఒక్కో గృహం(ఇండిపెండెంట్ హౌస్) నిర్మాణానికి రూ.1.50 లక్షలతో అంచనాలను రూపొందించింది. స్టేట్ రిజర్వు కోటా కింద ఎన్‌టిఆర్ రూరల్ హౌసింగ్ ప్రోగ్రాం(2017–18) పథకం ద్వారా వీటి నిర్మాణాలను చేపట్టాల్సిందిగా జీఓలో సూచించారు. శ్రీశైలంలో ఎలాంటి నివాసిత గృహాలు ఉండకూడదని, అక్రమ కట్టడాలు మొదలైనవన్నీ సున్నిపెంటకు తరలించాలని ఆదేశించారు.