శ్రీశైలం ఖాళీ చేయం
శ్రీశైలం: శ్రీశైలంలోని వివిధ కాలనీల ప్రజలను సున్నిపెంటకు తరలించాలని ప్రభుత్వం, దేవస్థానం సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రాణాలైనా అర్పిస్తాం కాని శ్రీశైలాన్ని ఖాళీ చేయమని తేల్చి చెప్పారు. శ్రీశైలం నుంచి గృహాల తరలింపు శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనంతో స్థానిక ప్రజలు అప్రమత్తమయ్యారు. వెంటనే అదేరోజు సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో కొత్తపేట, ఎస్సీ, ఎస్టీ, బీసీ, శ్రీగిరి కాలనీలకు చెందిన నివాసితులతో పాటు అన్ని పార్టీల స్థానిక నాయకులు సమావేశమయ్యారు. గత 50, 60 ఏళ్లుగా శ్రీశైలంలోనే నివాసముంటున్నామని, తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి పేరిట తమను సున్నిపెంటకు తరలించేందుకు యత్నిస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. శనివారం దండోరా వేసి క్షేత్ర వ్యాప్తంగా ఉంటున్న నివాసితులందరూ మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు. తమ పక్షాన నిలువకపోతే ఓట్లు వేసి గెలిపించిన నాయకులను సైతం నిలదీసేందుకు వెనుకాడమని హెచ్చరిస్తున్నారు..