ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
Published Mon, Feb 20 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM
దేవాదాయశాఖ స్థలంలో పేదల ఇళ్లు
కోర్టు ఆదేశాలతో తొలగించే యత్నం
అడ్డుకున్న స్థానికులు.. ఆత్మహత్యాయత్నం..
ఏప్రిల్ వరకు గడువిప్పించిన ఎమ్మెల్యే గోరంట్ల
ఆవలోని వాంబే గృహాల్లో ఇళ్లు ఇస్తామని హామీ
సాక్షి, రాజమహేంద్రవరం : దేవాదాయశాఖ స్థలంలో నిర్మించుకున్న ఇళ్ల తొలగింపులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు వైపు 37వ డివిజన్ పరిధిలోని వీరభద్రపురంలో టౌన్ సర్వే నంబర్ 919లో దువ్వూరి వెంకాయమ్మ సత్రం భూమి 526 చదరపు గజాలు ఉంది. ఈ భూమి పందిరి మహదేవుడు సత్రం ఆధీనంలో ఉంది. ఆ భూములను ఆక్రమించుకున్న 19 మంది 50 ఏళ్లుగా పెంకుటిళ్లు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. ఈ భూములు ఖాళీ చేయించేందుకు దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌లో పందరి మహదేవుడు సత్రం అధికారులు కేసు వేశారు. ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని ఆదేశిస్తూ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఆ భూమిని ఖాళీ చేయాలని ఆక్రమణల తొలగింపు అధికారి ఇన్‌చార్జ్ డీసీ డీఎల్‌వీ రమేష్‌బాబు వారికి మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. ప్రతిసారీ రాజకీయ పార్టీల నేతలు జోక్యం చేసుకుంటుండడంతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సోమవారం వారిని ఖాళీ చేయించేందుకు ఇన్‌చార్జ్ డీసీ రమేష్‌బాబు, పందిరి మహదేవుడు సత్రం ఈవో సుబ్రమణ్యం నేతృత్వంలో 50 మంది దేవాదాయ శాఖ సిబ్బంది వచ్చారు. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి సీఐ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో 10 మంది కానిస్టేబుళ్లు వచ్చారు. తాము ఇళ్లు ఖాళీ చేయబోమని అక్కడి వారు భీష్మించారురు. బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నించడంతో స్థానికుల్లో ఒకరు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయారు. అతడి ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. కేబుల్ వైర్లు, విద్యుత్ సౌకర్యం తొలగించారు. మహిళలు ఇంట్లో వస్తువులు ఓ వైపు తీసుకొస్తుండగానే దేవాదాయ శాఖ అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఈ నేపథ్యంలో అధికారులకు, స్థానికులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. స్థానిక కార్పొరేటర్ పెనుగొండ విజయభారతి, ఇతర కార్పొరేటర్లు తంగెళ్ల బాబి, పాలవలస వీరభద్రం, వైఎస్సార్‌సీపీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని బాధితులకు అండగా నిలిచారు. అయినా సిబ్బంది ఆక్రమణల తొలగింపు చేపట్టడంతో సమాచారం అందుకున్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు ఇతర అనుచరులతో ఘటనా స్థలానికి వచ్చారు. ఆదివారం ఈ విషయం ఈవో సుబ్రమణ్యంతో చర్చించినా తన మాట ఖాతరు చేయకుండా తొలగింపు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరందరికీ ఆవ రోడ్డులోని వాంబే గృహాలు కేటాయించనున్నామని, ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రకియ నిలిచిపోయిందన్నారు. మార్చి 25 తర్వాత వీరికి ఇళ్లు కేటాయించిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో ఆక్రమణలు తొలగింపజేస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు కూడా ఆగకుండా పేదలపై దేవాదాయ శాఖ సిబ్బంది ప్రతాపం చూపడం భావ్యం కాదన్నారు. ఎమెల్యే విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ వరకు గడువు ఇచ్చిన దేవాదాయ శాఖ ఇన్‌చార్జ్ డీసీ రమేష్‌బాబు సిబ్బందితో తిరిగి వెళ్లిపోయారు. ఏప్రిల్ మొదటి వారం వరకు గడువిచ్చామని, ఆ తర్వాత ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని రమేష్‌బాబు స్పష్టం చేశారు.
Advertisement