ఎంత కష్టం.. ఎంత కష్టం..
ఎంత కష్టం.. ఎంత కష్టం..
Published Wed, Jul 20 2016 9:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
కూర్చుంటే కసురుకుంటున్న కాంట్రాక్టర్లు
పనులు త్వరగా పూర్తిచేయాలంటూ నిర్వాహకుల ఒత్తిడిl
తాత్కాలిక సచివాలయంలో అమలు కాని కార్మిక చట్టాలు
కూటి కోసం కూలి కోసం
పట్టణంలో బతుకుదామని
బయలుదేరిన బాటసారికి
ఎంత కష్టం ఎంత కష్టం
చండ చండం తీవ్ర తీవ్రం..
జ్వరం కాస్తే, భయం వేస్తే ప్రలాపిస్తే
మబ్బుపట్టి, గాలికొట్టి
వానవస్తే, వరదవస్తే
దారితప్పిన బాటసారికి
ఎంత కష్టం.. ఎంత కష్టం..
ఇది పేదల ఎండిన డొక్కల చప్పుడు గురించి శ్రీశ్రీ తన అక్షరాలలో వినిపించిన గాథ. ప్రస్తుతం తాత్కాలిక రాజధాని నిర్మాణ పనుల్లో కార్మికుల పరిస్థితీ ఇలాగే ఉంది..బతుకుదెరువుకు ఊరిగాని ఊరి వచ్చి..అలుపెన్నది ఎరుగుక..ఆకలన్నది తీరక ఆయువును పణంగా పెట్టి పనులు చేస్తున్నారు..ప్రభుత్వ హడావుడి, కాంట్రాక్టర్ల కాఠిన్యానికి నిలువునా బలవుతున్నారు.
సాక్షి, అమరావతి: సచివాలయ నిర్మాణ పనుల్లో కూలీలకు కాంట్రాక్టర్లు చుక్కలు చూపిస్తున్నారు. షిఫ్ట్‌ల పద్ధతిన కాకుండా ఏకదాటిగా 10 గంటలపాటు పనులు చేయిస్తున్నారు. ఐదు నిమిషాలు కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం లేదని కూలీలు కన్నీరు పెడుతున్నారు. బరువులెత్తి అలసి కూర్చుంటే కాంట్రాక్టర్లు కసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు లేదా 7 గంటలకు విడిచి పెడుతున్నారు. మహిళలకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయకపోవటంతో ఎక్కడపడితే అక్కడ నిద్రిస్తున్నారు. మహిళా కూలీలు బయటకు చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారు. మంచినీరు కావాలంటే మందడం వెళ్లాలి. లేదంటే అక్కడే ఉన్న క్యాంటీన్‌లో కొనుగోలు చేసుకోవాలి. ప్రై వేటు క్యాంటీన్‌లో లీటరు రూ.5. అన్న క్యాంటీన్‌లో రూ.5లకు చిన్న గరిటే అన్నం పెడుతున్నారు. ఇది కూలీలకు సరిపోవడం లేదు. ఇదీ క్యాంటీన్ నిర్వహణ సమయానికి వెళితేనే. తాత్కాలిక సచివాలయ పనుల్లో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. ఇప్పటికైనా కార్మిక సంఘాలు స్పందించాలని వారు కోరుతున్నారు.
రాజధాని నిర్మాణంలో భాగంగా మొట్టమొదటగా చేపట్టి నిర్మాణం తాత్కాలిక సచివాలయం. ఐదు నెలల క్రితం ప్రారంభమైన నిర్మాణ పనుల కోసం ఒడిశా, మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చారు. గతlనెల 10న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర పనులు చేస్తుండగా ప్రమాదశాత్తు మరణించారు. అంతకు ముందు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో కూలీ మరణించడంతో అనేక మంది వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పనిచేసే కాంట్రాక్టు కూలీలను తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులకు తరలించారు. ఇటీవల తాత్కాలిక సచివాలయం రెండో భవనంలో పిట్టగోడ కూలడంతో ఐదుగురు గాయపడ్డారు. అందులో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా గుంటూరు నుంచి తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల కోసం కూలీలను తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వరుస సంఘటనలతో కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. తాత్కాలిక సచివాలయంలో పనిచేయటం ప్రాణాలతో చెలగాటమని తెలుసుకుని కొందరు మానేస్తుంటే.. మరి కొందరు విధిలేక నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పని చేస్తున్న కూలీలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. పనులు పూర్తి చేయటమే లక్ష్యంగా అధికారులు, పాలకులు దష్టి సారిస్తున్నారేగానీ వారి యోగక్షేమాల గురించి పట్టించుకోవడం లేదు.
Advertisement
Advertisement