
నయీం ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు!
నల్లగొండ: భువనగిరిలో గ్యాంగ్ స్టర్ నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు తనిఖీల్లో పాల్గొన్నారు. నయీం ఇంట్లో భారీగా నగదు ఉన్నట్టు సమాచారం. నయీం ఇంటిచుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.
నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసులు నయీం అనుచరులు, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేశారు. మిర్యాలగూడలో నయీం అత్త, ఆమె అక్క ఇళ్లల్లో సోదాలు చేసి 6.50 లక్షల రూపాయల నగదు, రెండు బ్యాగుల్లో డాక్యుమెంట్లు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. భువనగిరిలో నయీం ఇంట్లోను, అతని అనుచరుల ఇళ్లల్లోను తనిఖీలు చేపట్టారు. పోలీసులు భువనగిరి ఎంపీపీ వెంకట్ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలో పోలీసులు సోదాలు చేసి నయీం అనుచరులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. నయీం అనుచరుల ఇంట్లో కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రెండు కౌంటింగ్ మిషన్లతో డబ్బును లెక్కిస్తున్నారు. పోలీసులు రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాలకు నయీం ఈ ఇంటిని అడ్డాగా వాడుకున్నట్టు భావిస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నయీం హతమయ్యాడు. గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని ఎస్పీ రమా రాజేశ్వరి పరిశీలించారు. పోలీసులు నయీం కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో నయీం భార్య, కూతురు, అత్త, బావమరిది ఉన్నారు.