మహిళలు, బాలబాలికల అక్రమ రవాణా నిర్మూలన సామాజిక బాధ్యతగా భావించాలని కర్నూలు డీఎస్పీ డి.వి.రమణమూర్తి అన్నారు.
మహిళల అక్రమ రవాణా నిర్మూలన సామాజిక బాధ్యత
Published Sat, Jul 30 2016 11:23 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM
కర్నూలు:
మహిళలు, బాలబాలికల అక్రమ రవాణా నిర్మూలన సామాజిక బాధ్యతగా భావించాలని కర్నూలు డీఎస్పీ డి.వి.రమణమూర్తి అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు శనివారం తన కార్యాలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రో చైల్డ్ గ్రూప్, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్, విశ్వశాంత ఎడ్యుకేషనల్ సొసైటీ, బాలాజీ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ, సెవెన్ స్టార్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్, సుంకులాపరమేశ్వరి ఎడ్యుకేషనల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సొసైటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని డీఎస్పీ ప్రారంభించారు. ఒక వ్యక్తిని అమ్మడం/కొనడం/బలవంతంగా కాని, ప్రలోభ పెట్టి కాని, బలప్రయోగం ద్వారా కానీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం చట్టవిరుద్ధమన్నారు. మహిళలను వ్యభిచార వత్తులకు, బాలురను భిక్షాటనకు అమ్మేస్తుంటారని, ఇలాంటి వ్యక్తులను సకాలంలో గుర్తించి మహిళలు, బాలబాలికలను అక్రమ రవాణా నుంచి కాపాడవలసిన బాధ్యత సమాజంలోని ప్రతిపౌరుడు బాధ్యతగా తీసుకోవాలన్నారు. సంతకాలు చేయడం ద్వారా ఈ వ్యవస్థ నిర్మూలనకు యువకులు హామీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. కర్నూలు డివిజన్ ప్రచారోద్యమ కార్యకర్త ఈగల శ్రీనివాసులు, వెంకటరమణయ్య, వెంకటరాముడు, సురేష్, రాజన్న, శివశంకర్, శ్రీరాములు, రాంబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement