తాగునీటి కోసం నిరహార దీక్షా?
తాగునీటి కోసం నిరహార దీక్షా?
Published Fri, Jul 7 2017 11:01 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM
ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి
ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
ఐటీడీఏ ఎదురుగా ఆందోళన
రంపచోడవరం : ఏజెన్సీలో గిరిజనులు రక్షితనీటి కోసం ధర్నాలు, నిరాహార దీక్షాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. రంపచోడవరం ఐటీడీఏ ఎదురుగా శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో వై.రామవరం మండలం కోట గ్రామంలో ఒక వీధికి తాగునీరు కావాలంటూ శుక్రవారం రిలే నిరాహారదీక్ష చేశారు. దీక్ష శిబిరాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి సందర్శించారు. గిరిజనుల ఆందోళనకు ఆమె మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏజెన్సీలో గిరిజనుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. గిరిజన గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఎంతదూరమైన కాలినడకే శరణ్యమన్నారు. చాపరాయిలో 17 మంది గిరిజనులు చనిపోతే సీఎం చంద్రబాబు ఏజెన్సీకి రావడానికి కుదరలేదన్నారు. మంత్రులు వచ్చి చూసి వెళ్లాలన్నారు. గిరిజన, సాంఘిక సంక్షేమ మంత్రి రంపచోడవరం ఐటీడీఏలో అధికారులతో మాట్లాడి వెళ్లిపోయారన్నారు. ఇప్పటికీ ఏజెన్సీలో కాళ్లవాపుతో 17 మంది, మతాశిశు మరణాలు 216, చాపరాయిలో జ్వరాలతో 17 మంది చనిపోయినా ఏజెన్సీలో వైద్య సేవలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ టోల్ ఫ్రీ నంబర్‌కు పోన్ చేస్తే మంచినీటి సమస్యలు పరిష్కారిస్తామంటున్నారు. ఏజెన్సీలో బోర్లు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. గిరిజనుల సమస్యలపై ఐక్యంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎంతో చక్కగా పనిచేస్తున్నారని, నాలుగు అవార్డులు కూడా వచ్చినట్లు సెలవిచ్చారన్నారు. అవార్డులు ఎవరిచ్చారని అయన ఎక్కడ పెట్టుకున్నారని ఘాటుగా విమర్శించారు. విశాఖ, తూర్పు ఏజెన్సీ గ్రామాల్లో పర్యటిస్తే వణుకున్న గిరిజనుల పరిస్థితులు తెలుస్తాయన్నారు. కోట గ్రామం నుంచి కిందివీధి బోర్ల నుంచి తెచ్చిన బురద నీటిని ఎమ్మెల్యే రాజేశ్వరి, రామకృష్ణలు పరిశీలించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, డివిజన్ నాయకుడు జుత్తుక కుమార్ తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షలో పాల్గొన్న గిరిజనులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
గిరిజనులతో మాట్లాడిన పీఓ..
ఐటీడీఏ ఎదురుగా రిలే దీక్ష చేసిన కోట గిరిజనులతో పీఓ దినేష్‌కుమార్ మాట్లాడారు. గ్రామంలో బోర్ల మరమ్మతులకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. గిరిజనులు తెచ్చిన బోరు నీటిని పీఓ పరిశీలించారు. అలాగే ఆదివాసీ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బోండ్ల వరప్రసాదరావు కూడా దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.
Advertisement
Advertisement