ఉపాధిలో నిర్లక్ష్యంపై కొరడా
ఉపాధిలో నిర్లక్ష్యంపై కొరడా
Published Sun, Mar 5 2017 11:01 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM
-ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బందికి వారం వేతనాలు నిలుపుదల
- 22 మండలాలకు కలెక్టర్ ఉత్తర్వులు
- ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు
కోవెలకుంట్ల: జిల్లాలో మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యంపై కలెక్టర్ విజయమోహన్ కొరడా ఝుళిపించారు. ఫిబ్రవరి నెల లక్ష్యాన్ని చేరడంలో అలసత్వం వహించిన 22 మండలాల ఎంపీడీఓలు, ఉపాధి పథకం సిబ్బందికి షాక్ ఇచ్చారు. ఆ పథకం ప్రోగ్రాం ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఆయా మండలాల ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలకు వారం రోజులపాటు వేతనాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖరీఫ్, రబీసీజన్లలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం జిల్లాలో 36 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లో కూలీలకు జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి పనుల నిర్వహణపై జిల్లా అధికారులు దృష్టిసారించారు.
ఇందులో భాగంగా జిల్లాలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లేబర్ బడ్జెట్ మార్చి 196 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఈ ఏడాది ఫిబ్రవరి నెలవరకు 140 లక్షల పనిదినాలు పూర్తి కాగా 56 లక్షల పనిదినాలు మిగిలిపోయాయి. వలసల నియంత్రణే ధ్యేయంగా వీలైనంత ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించాలన్న ఉద్ధేశ్యంతో కలెక్టర్ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఆయా మండలాలకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఒక్కో మండలంలో రోజుకు కనీసం 5 వేల మందికి పనులు కల్పించాలని ఆదేశించారు.
22 మండలాలకు వేతన నిలుపుదల ఉత్తర్వులు..
నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో జనవరి నుంచి వ్యవసాయ పనులు ముఖ్యంగా మిరప కోత పనులు ముమ్మరంగా ఉండడంతో కూలీలు ఉపాధి పనులపై ఆసక్తి చూపలేదు. ఈ కారణంగా ఆయా మండలాల్లో కూలీల సంఖ్య తగ్గిపోయింది. దీంతో లక్ష్యం మేరకు కూలీలకు పనులు కల్పించలేకపోయారు. బేతంచెర్ల, కర్నూలు, నంద్యాల, గూడూరు, కౌతాళం, బనగానపల్లె, మిడుతూరు, చాగలమర్రి, అవుకు, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, పాణ్యం, మహానంది, వెలుగోడు, సంజామల, గడివేముల, కోవెలకుంట్ల, నంద్యాల, రుద్రవరం, గోస్పాడు, బండిఆత్మకూరు, శిరువెళ్ల మండలాల్లో పనిచేస్తున్న ఏపీఓలు, ఈసీలు, కొందరు టెక్నికల్ అసిస్టెంట్లకు వారం వేతనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. మార్చినెలకు సంబంధించిన వారం రోజుల వేతనాన్ని ఏప్రిల్ నెల వేతనంలో కట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరితో పాటు నిర్ధేశించిన లక్ష్యంలో 25శాతం మించని ఆ పథకం పీఓలుగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓలకు షోకాజ్Œ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి సిబ్బందికి వేతనాలు నిలుపుదల, ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు అందటంతో అధికారులు, సిబ్బంది నివ్వెరపోయారు.
Advertisement