- ప్రేమించి.. పెళ్లాడిన వైనం
- విడాకుల కోసం భర్త వేధింపులు
భార్య జుత్తు కత్తిరించేశాడు
Published Sat, Dec 17 2016 10:56 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM
ప్రేమించానని నమ్మించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. 22 నెలలు కాపురం చేశాక.. ‘నువ్వు ఇష్టం లేదు, విడాకులు ఇచ్చేయ్’ అంటున్నాడు. రెండుసార్లు గర్భం పోవడానికి కారణమై.. అంతటితో ఆగకుండా ఆమె జడను కత్తిరించి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఈ సంఘటన కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం పోలీసు స్టేష¯ŒS పరిధిలోని కొవ్వాడలో చోటుచేసుకుంది. బాధితురాలు శనివారం విలేకరుల వద్ద తన ఆవేదన వెళ్లగక్కింది. వివరాలు ఇలా ఉన్నాయి.
కొవ్వాడ (కాకినాడ రూరల్) :
కొవ్వాడలో నివసిస్తున్న పొన్నమండ రమణ, వెంకటరత్నం దంపతుల కుమారై దేవీప్రసన్న. ఆమెను ప్రేమిస్తున్నానంటూ కాకినాడ రామారావుపేటకు చెందిన జవహర్ వివేక్ నమ్మించాడు. కొంతకాలం దుబాయ్‌లో పనిచేసిన ఇతడు.. ఏడేళ్లుగా దేవీప్రసన్న వెంటపడ్డాడు. ఎట్టకేలకు ఆమె పెద్దలను ఒప్పించి, పెద్దల సమక్షంలో 2015 మార్చి ఏడో తేదీన అన్నవరం దేవస్థానంలో దేవీప్రసన్నను వివాహం చేసుకున్నాడు. అప్పట్లో దేవీప్రసన్న తల్లిదండ్రులు కట్నకానుకల కింద రూ.1.50 లక్షలు ఇచ్చారు. కొవ్వాడలోనే దేవీప్రసన్న తల్లిదండ్రుల ఇంటి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. కొంతకాలం తర్వాత తనకు డబ్బులివ్వాలంటూ డిమాండ్ చేయగా.. దేవీప్రసన్న తల్లిదండ్రులు రూ.34 వేలు వివేక్ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేశారు. గర్భిణీగా ఉన్న సమయంలో దేవీప్రసన్న కడుపుపై వివేక్ తన్నడంతో గర్భస్రావం జరిగింది. మరోసారి దేవీప్రసన్నకు గర్భం వస్తే బలవంతంగా మాత్రలు మింగించాడు. ఇంటి తలుపులు మూసి ఆమె జుట్టును కత్తిరించాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. నెల రోజుల క్రితం బంధువుల శుభకార్యానికి వెళ్లిన సమయంలో వివేక్ తన ఇంట్లో రూ.3 లక్షల విలువైన సామాన్లను తరలించుకుపోయాడు. అప్పటి నుంచి ఇంటికీ రావడం మానేశాడు. నిత్యం దేవీప్రసన్నకు ఫో¯ŒS చేసి ఆమెను, ఆమె తల్లిదండ్రులను చంపేస్తానంటూ బెదిరించాడు. పెద్దల వద్ద తగవు పెట్టినా పట్టించుకోలేదు. ఐదు నెలలుగా ఇంటి అద్దె కూడా చెల్లించలేదు. తమకు న్యాయం చేయాలని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ దేవీప్రసన్న.. పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు సిఫారసు చేయగా, అతడి బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయి. దేవీప్రసన్న తండ్రిపైనా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తనకు విడాకులు ఇస్తే వేరే పెళ్లి చేసుకుంటానని పేర్కొన్నాడు. ఈ విషయమై ఇంద్రపాలెం ఎస్‌ఐ బి.తిరుపతిరావును వివరణ కోరగా, దేవీప్రసన్న తన భర్త వివేక్‌పై ఫిర్యాదు చేసిందన్నారు. దీనిపై భార్యాభర్తల సమస్య కారణంగా ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు రిఫర్ చేశామన్నారు. అయితే ఆమె భర్త ఒప్పుకోవడం లేదని తెలిసిందని, దీనిపై కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు.
Advertisement