
త్వరలో ఐఏఎస్‌ల బదిలీలు?
– జిల్లాలో కలెక్టర్, టీటీడీ ఈవో, జేఈవోలు?
– తిరుపతి కమిషనర్‌కూ బదిలీ ఖాయమని ప్రచారం
తిరుపతి : జిల్లాలోని పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసినట్లు వినిపిస్తోంది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ సిదార్థ్ జైన్, టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవోలు కె.శ్రీనివాసరాజు, పోలా భాస్కర్ బదిలీలు ఖాయమని తెలుస్తోంది. 2014 జూలైలో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను వెలగపూడిలోని నూతన సెక్రటరియేట్‌కు బదిలీ చేయనున్నారని సమాచారం. అదేవిధంగా సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందిన టీటీడీ ఈవో సాంబశివరావుకు కూడా సముచితమైన పోస్టింగ్ ఇవ్వనున్నట్లు తెలిసింది. సీఎంవోలోనే కీలక అధికారిగా సాంబశివరావు బాధ్యతలు తీసుకునే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇకపోతే దీర్ఘకాలంగా తిరుమల, తిరుపతి జేఈవోలుగా విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారులు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్‌లను కూడా బదిలీ చేయనున్నారని వినికిడి. వీరిని బదిలీ చేయడం ద్వారా కొత్త వారికి, టీటీడీ సేవలపై ఆసక్తి చూపే అధికారులకూ అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే టీటీడీ పరిపాలన వ్యవహారాల్లో సమగ్రమైన అనుభవం ఉన్న అధికారులను అందరినీ ఒకేసారి బదిలీ చేయడం సముచితం కాదని కూడా యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తే శ్రీనివాసరాజు బదిలీకి బ్రేక్ పడే వీలుందంటున్నారు. ఇదిలా ఉండగా, తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న వినయ్‌చంద్‌ను ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ చేసే వీలుందని విశ్వసనీయ సమాచారం.