
డాక్టర్ కె. మాధవీలత
తిరుపతి తుడా : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ సెక్రటరీ డాక్టర్ కె. మాధవీలత కన్ఫర్డ్ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది గ్రూప్ వన్ ఆఫీసర్లకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జాబితాలో తుడా సెక్రటరీ మాధవీలత మొదటి స్థానంలో నిలిచారు. ఏపీపీఎస్‌సీ 2007లో గ్రూప్ వన్ రాయగా ఆమె రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌ను సాధించారు. శిక్షణ అనంతరం కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీఓగా, నెల్లూరు ఆర్డీఓగా పనిచేశారు. ఆపై 2014లో తిరుపతి పట్టణాభివృద్ధి సెక్రటరీగా నియమితులయ్యారు. ఈమె జిల్లాలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, తుడా వైస్ చైర్మన్, టీటీడీ భూసేకరణ అధికారి, డ్వామా పీడీ, తెలుగు గంగ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా మాధవీలత విజయవంతంగా బాధ్యతలను నిర్వర్తించారు.
మలకాటపల్లె నుంచి ఐఏఎస్ వరకు..
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట సమీపంలోని మలకాటపల్లెకు చెందిన కేవీ కృష్ణారెడ్డి, రామలక్ష్మమ్మ దంపతులకు తొలి సంతానం మాధవీలత. ఈమె ప్రాథమిక విద్య కడపలో, ఇంటర్మీడియట్ మహబూబ్ నగర్ లో చదివారు. అనంతరం ఎంసెట్ ద్వారా వ్యవసాయ విద్యలో సీటు సంపాదించారు. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కళాశాలలో వ్యవసాయ విద్యలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఆపై కంది పంటపై పరిశోధన పూర్తి చేసి, డాక్టరేట్ పొందారు. ఆమె చేసిన పరిశోధనల కారణంగా ప్రముఖ ఇక్రిశాట్ సంస్థలో శాస్త్రవేత్తగా అవకాశం కల్పించింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన భర్త వెంకటరామమునిరెడ్డి (ప్రముఖ సైంటిస్టు) అంతటితో ఆగకుండా గ్రూప్స్ రాయించారు. భర్త నమ్మకాన్ని వమ్ముచేయకుండా మొదటి దశలోనే ఏపీపీఎస్‌సీలో మహిళా విభాగంలో రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆమెను కేంద్రం కన్ఫర్డ్ ఐఏఎస్‌గా ప్రకటించింది.
మరింత సేవచేసే అవకాశం
వ్యవసాయ విద్య ద్వారా రైతుకు అండగా నిలిచి సేవ చేయాలను కున్నా. గ్రూప్ వన్ రాయడంతో రాష్ట్ర మొదటి ర్యాంక్ వచ్చింది. దీంతో వ్యవసాయ రంగాన్ని వదులుకుని అడ్మినిష్ట్రేషన్ రంగంలోకి వచ్చాను. అయితే ఈ రంగం ద్వారా రైతులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు మరింగా సేవ చేయవచ్చు. ఐఏఎస్‌గా మరింతగా ప్రజలకు దగ్గరై మెరుగైన సేంలందించే అవకాశం లభించింది. – డాక్టర్ కె. మాధవీలత,తుడా సెక్రటరీ
Comments
Please login to add a commentAdd a comment