
అనారోగ్యలక్ష్మి..!
► ఆరోగ్యలక్ష్మి పథకానికి సరుకుల కొరత
► అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలుకు నోచుకోని మెనూ
► నిలిచిన భోజనం
► గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందని పౌష్టికాహారం
► ఐదు నెలలుగా సరఫరా కాని నూనె
► పర్యవేక్షణ లోపం
ఆదిలాబాద్‌టౌన్: గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో పథకం అమలులో ఆటంకం ఎదురవుతోంది. ఫలితంగా జిల్లాలో ఆరోగ్యలక్షి పథకం అనారోగ్యలక్ష్మిగా మారింది. జిల్లాలోని చాలా అంగన్‌వాడీ కేంద్రాల్లో బియ్యం, పాలు, కంది పప్పు, నూనె సరఫరా కావడం లేదు. కోడి గుడ్ల సరఫరా పూర్తిస్థాయిలో జరగడం లేదు.
మురుకులు కూడా లేకపోవడంతో కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. దీంతో ఐసీడీఎస్ అస్తవ్యస్తంగా మారుతోంది. ఆకుకూరలు, కోడిగుడ్లు, పాలు, పెరుగుతో కూడిన పౌష్టికాహారం అందించాల్సి ఉన్నప్పటికీ కనీసం పప్పు అన్నం కూడా పెట్టడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సరకులు లేకపోవడంతో చాలా కేంద్రాల్లో వంట చేయడం లేదు. సమయానికి కేంద్రాలు తెరవడం లేదు. పిల్లల సంఖ్య ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ ఉండడం లేదు. కొన్ని సెంటర్లలో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు వండిన భోజనం టిఫిన్ బాక్స్‌ల్లో పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల, సూపర్‌వైజర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో ఐసీడీఎస్ గాడితప్పింది. రెగ్యులర్ అధికారులు లేక పోవడంతో పర్యవేక్షణ కొరవడుతోంది.
జిల్లాలో..
జిల్లాలోని 18 మండలాల్లో 5 ప్రాజెక్టులు, 51 సెక్టార్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,256 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 987 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 269 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు 31,471 మంది, 3 సంవత్సరాల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 22,053 మంది, గర్భిణులు, బాలింతలు 13,357 మంది ఉన్నారు. కాగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రతి రోజు ఒక పూట మధ్యాహ్నం పూర్తి స్థాయి భోజనం వండిపెట్టాలి. కానీ జిల్లాలో ఏ కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. చాలా కేంద్రాల్లో ప్రస్తుతం నూనె, కందిపప్పు, బియ్యం సరుకులు లేవు. నాణ్యమైన భోజనం వండిపెట్టకపోవడంతో లబ్ధిదారులు కేంద్రాలకు రావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా ఉడికించకుండానే కార్యకర్తలు వాటిని ఇంటికి ఇస్తున్నారు. అయితే ఈ నెలకు సంబంధించి ఇంకా కోడి గుడ్లు కేంద్రాలకు సరఫరా చేయలేదని అంగన్‌వాడీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.
లోపించిన పర్యవేక్షణ..
ఐసీడీఎస్‌లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు చాలామంది సమయపాలన పాటించడంలేదు. సక్రమంగా కేంద్రాలను తెరవడంలేదు. దీంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావడానికి ఆసక్తి చూపడంలేదు. కేంద్రాలు తెరిచిన వారిలో చాలామంది అంగన్‌వాడీలు భోజనం సక్రమంగా వండి పెట్టడం లేదు. సరుకులు ఉన్న కేంద్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. పర్యవేక్షించాల్సిన కొంతమంది సూపర్‌వైజర్లు కార్యాయానికి పరిమితం అవుతున్నారు.
దీంతో కొందరు అంగన్‌వాడీ కార్యకర్తలు లబ్ధిదారులకు అందజేయాల్సిన గుడ్లు, ఇతర సరుకులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరో పణలు ఉన్నాయి. కాగా ఆదిలాబాద్, ఉట్నూర్ ప్రాజెక్టుల సీడీపీవోలు డిప్యూటేషన్‌లో ఉండడంతో సూపర్‌వైజర్లు ఇన్‌చార్టీలుగా వ్యవహరిస్తున్నారు. 51 మంది సూపర్‌వైజర్లకు గాను 29 మంది మాత్రమే పని చేస్తున్నారు. 26 పోస్టులు ఖాళీగా దీంతో కేంద్రాల పర్యవేక్షణ లోపించి ఆరోగ్యలక్ష్మి అనారోగ్యలక్ష్మిగా మా రుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ పథకంలో భాగంగా మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. కానీ ఏ కేం ద్రంలో మెనూ పాటించడం లేదు. ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు జాడలేదు. పప్పునీళ్లు, ఉడికించిన గుడ్డును మాత్రమే ఇస్తున్నారు. దొడ్డు బియ్యంతో భోజనం పెట్టడంతో చాలా మంది తినడానికి కేంద్రాలకు రావడం లేదు.
వారం ఇవ్వాల్సిన భోజనం
సోమవారం అన్నం, కూరగాయలతో సాంబారు, గుడ్డు కూర, పాలు
మంగళవారం అన్నం, పప్పు, ఆకు కూరలు, గుడ్డు, పాలు
బుధవారం అన్నం, ఆకు కూరలతో పప్పు, గుడ్డుకూర, గుడ్డు, పాలు
గురువారం అన్నం,కూరగాయలతో సాంబారు, పెరుగు,గుడ్డుకూర, పాలు
శుక్రవారం అన్నం, పప్పు, ఆకుకూరలతో కూర, గుడ్డు, పాలు
శనివారం ఆకుకూరలతో పప్పు, పెరుగు, గుడ్డు, పాలు
నూనె సరఫరా లేదు..
గత కొన్ని నెలలుగా నూనె సరఫరా కావడం లేదు. పాలు, గుడ్లు, బియ్యం, కంది పప్పు సరుకులు కేంద్రాల్లో ఉన్నాయి. అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు, పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. ప్రతి రోజు కేంద్రాలను తెరవాలి.
– ఉమారాణి, ఇన్‌చార్జి సంక్షేమాధికారి, ఆదిలాబాద్