
ఆదిలాబాద్ టౌన్ : గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ జిల్లాలో పథకం అనారోగ్యలక్ష్మీగా మారింది. పలు అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో పథకానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలలో పాలు, నూనె, పప్పు సరఫరా కావడంలేదు. కోడిగుడ్లు సరఫరా అవుతున్నప్పటికీ కొన్ని సెంటర్లలో వాటిని సక్రమంగా పంపిణీ చేయడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 5 ప్రాజెక్టులు, 51 సెక్టార్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,256 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 987 మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు, 269 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 6నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 21,685 మంది, 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 30,503 మంది, గర్భిణీ, బాలింతలు 10,520 మంది ఉన్నారు. కాగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రతిరోజు ఒక పూట మధ్యాహ్నం పూర్తి స్థాయి భోజనం వండిపెట్టాలి. కానీ జిల్లాలో ఏ కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ప్రస్తుతం చాలా కేంద్రాల్లో పాలు, నూనె, పప్పులు లేవు. ఉడికించిన కొడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా ఉడికించకుండానే కార్యకర్తలు వాటిని ఇంటికి ఇస్తున్నారు.
లోపించిన పర్యవేక్షణ..
ఐసీడీఎస్‌లో రెగ్యూలర్ అధికారులు లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. ఆదిలాబాద్ అర్బన్ ప్రాజెక్టుకు గత ఐదారు సంవత్సరాలుగా ఇన్‌చార్జి అధికారులతో కాలం వెల్లదీస్తున్నారు. దీంతో చాలా అంగన్‌వాడీ కార్యకర్తలు సమయపాలన పాటించడంలేదు. దీంతో కొంత మంది అంగన్‌వాడీ కార్యకర్తలు లబ్ధిదారులకు అందజేయాల్సిన గుడ్లు, ఇతర సరుకులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపనలు ఉన్నాయి. ఆదిలాబాద్ అర్బన్ ప్రాజెక్టులో డిసెంబర్ 20 నుంచి పాల సరఫరా లేదు. ఉట్నూర్, బోథ్ ప్రాజెక్టులో కూడా అదే పరిస్థితి. పాలసరఫరా నిలిచి నెలరోజులు దాటినా అధికారులు పట్టించుకోవడంలేదని అంగన్‌వాడీ కార్యకర్తలు, లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
పాలకోసం టెండర్ వేస్తాం..
గత కొన్ని రోజులుగా పాల సరఫరా నిలిచిపోయింది. త్వరలో కొత్త టెండర్‌లు వేస్తాం. పప్పు, నూనె, సరుకులు ఉన్నాయి. అంగన్‌వాడీ కార్యకర్తలు మెనూ ప్రకారం భోజనం వండిపెట్టాలి. సమయానికి కేంద్రాలను తెరవాలి. – మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి
Comments
Please login to add a commentAdd a comment