
ఆదర్శ నేతలు
తమ పిల్లలను సర్కారు స్కూలుకు పంపిస్తున్న ప్రజాప్రతినిధులు
సాధారణంగా సర్కారు బడంటేనే చిన్నచూపు.. కూలీ పనికి వెళ్లేవారు కూడా తమ పిల్లలను సర్కారు బడికి బదులు ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు.. ఇటువంటి రోజుల్లో కొందరు ప్రజాప్రతినిధులు తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.. వీరిపై ఈవారం సండేస్పెషల్
వారు ప్రజాప్రతినిధులు..
ఆర్థికంగా, సామాజికంగా పలుకుబడి కలిగినవారే.. పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివించే స్థోమత ఉన్నవారే.. అయినా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లో తిరిగి, విద్యార్థులను సర్కారు బడులకే పంపాలని ప్రచారం చేశారు. తామే ఆదర్శంగా ఉండేందుకు పలువురు ప్రజాప్రతినిధులు తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నారు. ఆదర్శంగా నిలుస్తున్న నేతలపై సండే స్పెషల్..
బీర్కూర్ : తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు బీర్కూర్ ఎంపీపీ మీనా హన్మంతు. ఈనెల 9న గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం కోసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎంపీపీ మీనాహన్మంతు దంపతులు మాట్లాడారు. ఒకటో తరగతిలో తమ కుమారుడు శ్రీహర్షను చేర్పించడానికి అంగీకారం తెలిపారు. పాఠశాల పునఃప్రారంభం రోజు గ్రామంలోని గడివద్ద గల ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. 13న సర్కారు బడిలో అక్షరాభ్యాసం చేయించారు. శనివారం పాఠశాలలో విద్యారుథలకు పాఠ్యపుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తమ కుమారుడిని క్రమం తప్పకుండా సర్కారు బడికి పంపిస్తున్నామన్నారు. తన కుమారుడు అందిరితోపాటే క్యూలో వచ్చి పాఠ్యపుస్తకాలు తీసుకున్నాడని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తుందని, సర్కారు బడులు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.
మొదటినుంచీ..
నాగిరెడ్డిపేట : పోచారం సర్పంచ్ గోపాల్‌గౌడ్ తన కూతురు సాయిభవానిని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. సాయిభవాని ఐదో తరగతి చదువుతోంది. తన కూతురును ఒకటో తరగతినుంచే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నానని గోపాల్‌గౌడ్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే.. సర్కారు బడి బాగుపడుతుందని పలువురు పేర్కొంటున్నారు.
ఐదేళ్లుగా...
సిరికొండ : తూంపల్లి సర్పంచ్ బూస దేవరాజ్ తన కూతురు హేమవర్షికను సర్కారు బడిలో చదివిస్తున్నారు. దేవరాజ్‌కు ఇద్దరు పిల్లలు. కూతురు హేమవర్షిక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. కుమారుడు రిషివర్ధన్‌కు మూడేళ్లు. తన కూతురును ఒకటో తరగతినుంచి సర్కారు బడిలోనే చదివిస్తున్నానని దేవరాజ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై గ్రామస్తులందరికీ నమ్మకం ఉండాలనే తన కూతురును ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నానన్నారు.
నమ్మకం పెంచేందుకే..
మాచారెడ్డి : ఘన్‌పూర్ (ఎం) ఎంపీటీసీ సభ్యుడు ఎడపల్లి శ్రీనివాస్ తమ ఇద్దరు పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నారు. ఆయన కూతురు మేఘనను చుక్కాపూర్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. కుమారుడు కార్తీక్‌ను గ్రామంలోని పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలల్లో చేర్చాలంటున్న ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు.. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే ప్రజలకు నమ్మకం పెరుగుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకే తన పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నానన్నారు.
సర్పంచ్ కూతురు..
నిజాంసాగర్ : బూర్గుల్ సర్పంచ్ దుడ్డె అనితా సురేందర్ తన కూతురు షర్మిలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. షర్మిల మూడో తరగతి చదువుతోంది. సర్పంచ్ తన కూతురును ప్రభుత్వ పాఠశాలకు పంపుతుండడంతో గ్రామస్తులూ సర్కారు బడిని ఆదరిస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ తెలిపారు.