ప్రహరీ లేని దేశాయిపల్లి ప్రభుత్వ పాఠశాల
-
పూర్తయిన జియోగ్రాఫికల్ ఇంటిగ్రేటేడ్ సర్వే
-
పాఠశాలల స్థితిగతులు ఇక ఆన్‌లైన్‌లోనే..
-
వసతులు లేని ప్రైవేటు పాఠశాలలపై చర్యలకు ఆదేశం?
వీణవంక : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల స్థితిగతులపై ఇటీవల విద్యాశాఖ ప్రారంభించిన జియోగ్రాఫికల్ ఇంటిగ్రేటేడ్ సర్వే (జీఐఎస్)జిల్లావ్యాప్తంగా పూర్తయ్యింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని వసతుల వివరాలను వేర్వేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. గత ఏప్రిల్‌లో ప్రారంభమైన జీఐఎస్ సర్వే.. జిల్లాలోని 3102 ప్రభుత్వ, 600 ప్రైవేటు పాఠశాలలో కొనసాగింది. ఆ వివరాలు సేకరించి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కలిగిన మోబైల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేశారు. పాఠశాలలో కనీస వసతులు ఉన్నాయా..? లేదా..? తెలుసుకునేందుకు విద్యాశాఖ జీఐఎస్ సర్వే ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపర్చింది. వసతులు లేని కొన్ని ప్రైవేటు పాఠశాలలను విద్యాశాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. త్వరలో ఆ పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ 30 శాతం వరకు మరుగుదొడ్లు లేవని సర్వేలో వెల్లడైందని సమాచారం.
ఆన్‌లైన్‌లో నమోదు ఇలా
జిల్లాలో కేజీబీ, ఉన్నత పాఠశాలలు 721, ప్రాథమికోన్నత పాఠశాలలు 339, ప్రాథమిక పాఠశాలలు 1995, మోడల్ స్కూల్‌లు 47, ప్రైవేటు పాఠశాలలు 600వరకు ఉన్నాయి. జీఐఎస్ సర్వే కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కలిగిన మోబైల్‌ను విద్యాశాఖ రూపొందించింది. ఆ మోబైల్ ద్వారా పాఠశాల భవనం, మంచినీటివసతి, మరుగుదొడ్లు, కరెంట్ సౌకర్యం, సైన్స్‌ల్యాబ్, మూత్రశాలలు, ప్రహరీ, క్రీడామైదానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మోబైల్ ద్వారా ఫొటోలు తీసి వేర్వేరుగా గూగుల్స్‌కు అనుసంధానం చేశారు. దీని ద్వారా ఏయే పాఠశాలలో ఎలాంటి వసతులు ఉన్నాయో.. విద్యాశాఖ ఆన్‌లైన్‌లో గుర్తిస్తుంది. అలాగే మానిటరింగ్ చేసేటప్పుడు ఈ ఆన్‌లైన్‌తో సులభంగా తనిఖీ చేసే వీలుందని అధికారులు చెబుతున్నారు.
వసతులు లేని పాఠశాలల గుర్తింపు
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో కనీస వసతులు లేని పాఠశాలలను జీఐఎస్ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలో ప్రహరీ, మూత్రశాలలు, క్రీడామైదానం లేవని సర్వేలో తేలినట్లు సమాచారం. వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా.. వసతులు కల్పనలో వెనుకంజ వేయడం విమర్శలు తావిస్తోంది. కొన్ని పాఠశాలలో కనీసం ప్రేయర్ చేయడానికీ స్థలం లేదని నిర్ధరణ కావడం యాజమాన్యాల దోపిడీకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జీఐఎస్ ద్వారా సర్వే చేసిన విద్యాశాఖ అధికారులు వసతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.