ఫ్రిజ్ ఉంటే ఇల్లు రాదు
పేదలకు సొంత ఇల్లు దక్కడం గగనమే
రాయితీ ఇళ్ల మంజూరులో సర్కారు కొత్త నిబంధనలు
గృహ నిర్మాణ శాఖ జీవో జారీ
యూనిట్ కాస్ట్ రూ.2.75 లక్షల నుంచి రూ.2.25 లక్షలకు కుదింపు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదోడికి సొంతింటి కల కలగానే మిగిలిపోయే ప్రమాదం వచ్చి పడింది. గూడు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పేదలకు సర్కారు ఇచ్చిన జీవో అశనిపాతంలా పరిణమించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం పొందాలంటే 13 రకాల నిబంధనలు పాటించాలన్న షరతులతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా జీవోనే జారీ చేయడంతో కలకలం రేగుతోంది.
రాష్ట్రంలో మంజూరు చేస్తున్న ఇళ్లలో ఒక్కోదానికి రూ.72 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఇప్పటికే ఇంటి నిర్మాణం (యూనిట్ కాస్ట్) మొత్తాన్ని రూ.2.75 లక్షల నుంచి రూ.2.25 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. దీనికితోడు కేంద్రం పెట్టిన షరతులను సాకుగా చూపి 13 రకాల నిబంధనలను అమల్లోకి తెస్తూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఇటీవల జీవో నంబర్ 90 జారీ చేసింది. ఈ జీవోను కచ్చితంగా అమలు చేస్తే వాస్తవంగా ఒక్క ఇల్లు కూడా మంజూరయ్యే అవకాశం లేదని పేదలు వాపోతున్నారు.
ఏడాదైనా ఒక్క ఇల్లూ రాలేదు
ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో గతేడాది ఆగస్టులో రెండు లక్షల ఇళ్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 1.26 లక్షల దరఖాస్తులు సక్రమంగా ఉన్నట్టు తేల్చారు. ఏడాదైనా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. 13 రకాల నిబంధనలను పరిగణనలోకి తీసుకొని ఇళ్లు మంజూరు చేయాలని ఉన్నతాధికారులు మౌఖికంగా చెప్పారు.
ఇవీ నిబంధనలు...
ఇళ్ల మంజూరుకు చెబుతున్న నిబంధనలను పరికిస్తే రాష్ట్రంలో ఒక్కరికైనా ఇల్లు వస్తుందా? అనేది అనుమానమే. ప్రభుత్వం కేటాయించే ఇల్లు రావాలంటే ఇవి ఉండకూడదు. ఫ్రిజ్, ల్యాండ్‌లైన్ ఫోన్, మోటార్ సైకిల్, మూడు, నాలుగు చక్రాల వాహనాలు, వ్యవసాయ యంత్రాలు, వ్యవసాయ అనుబంధ యంత్రాలుండకూడదు. లబ్ధిదారుడు ప్రభుత్వ ఉద్కోగి కాకూడదు, కుటుంబంలో ఏ ఒక్కరికైనా రూ.10 వేలకు పైగా వేతనం రాకూడదు. రూ.50 వేలకు పైగా విలువైన కిసాన్ పత్రాలు ఉండకూడదు. ఆదాయపు పన్ను, వృత్తి పన్ను చెల్లించేవారూ అనర్హులు. సొంతంగా 2.5 ఎకరాల మాగాణి, ఏడున్నర ఎకరాలకు పైగా మెట్ట భూమి ఉండకూడదు. రెండెకరాలకు మించి కౌలు చేసినా ఇల్లు ఇవ్వరు. పేదలకు వెసులుబాటిస్తే తప్ప రాష్ట్రంలో ఒక్క ఇల్లయినా మంజూరు చేసే అవకాశం లేదన్నది వాస్తవం.