అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నల్లగొండ కల్చరల్/నల్లగొండ రూరల్ : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముందుగా సెయింట్ ఆల్ఫోన్సిస్ హైస్కూల్‌కు చెందిన 400 మంది విద్యార్థులు భారతదేశంలోని అన్ని రంగాల అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాలను తెలిపేలా నృత్యాన్ని ప్రదర్శించారు. నల్లగొండ కేంద్రీయ పాఠశాల విద్యార్థులు కృష్ణా పుష్కర కథ, ఇతర నదుల పుష్కరాల వివరాల రూపకాన్ని, నారాయణ హైస్కూల్ విద్యార్థులు స్వచ్ఛభారత్, మిషన్ కాకతీయ అంశాలను, ఎస్‌ఎస్ హైస్కూల్ ఆఫ్ లెర్నింగ్ విద్యార్థులు హరితహారం, మిషన్ కాకతీయ అంశాలపై రూపొందించిన పాటలకు నృత్యాలను ప్రదర్శించారు. చివరగా శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు తెలంగాణ పండుగలైన బతుకమ్మ, బోనాలపై ప్రదర్శన ఇచ్చారు.
పటిష్ట బందోబస్తు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిలకించేందుకు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోకి వచ్చిపోయే వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధాన ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్స్‌ను ఏర్పాటు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డిలు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనలను తిలకించారు.