ఈ ఆఫీస్‌లో జిల్లా ప్రథమం
ఈ ఆఫీస్‌లో జిల్లా ప్రథమం
Published Wed, May 3 2017 7:31 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM
ఏలూరు (మెట్రో): రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఈ ఆఫీస్ విధానంలో పశ్చిమగోదావరి జిల్లా సేవలు ప్రథమ స్థానంలో ఉన్నాయని రాష్ట్ర ఖజానా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్నారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్రస్థాయి ఖజానా శాఖ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ ఆఫీస్, ఈ కార్యాలయం, ఈ ఫైలింగ్ వంటి అంశాల్లో పశ్చిమ ముందంజలో ఉందన్నారు. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని చెప్పారు. బయోమెట్రిక్ హాజరు వేసి సదరు ఉద్యోగి కార్యాలయంలో లేకుంటే చర్యలు తప్పవని, అవసరమైతే సస్పెండ్ చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. మూడేళ్లు దాటిన ప్రతి ఉద్యోగి బదిలీ కావాలని, అప్పుడే ప్రజలకు సరైన సేవలు అందుతాయన్నారు. దీని వల్ల ఉద్యోగులకు అంకితభావం పెరుగుతుందని చెప్పారు. ప్రతి ఉద్యోగి సామాన్యుడిగా భావించుకుని విధులు నిర్వహించాలని సూచించారు.
నిబద్ధతతో పనిచేయాలి
ఉద్యోగుల కుటుంబ పోషణకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ప్రజలకు సేవ చేయాలనే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించి విధులు నిర్వర్తించాలన్నారు. ఖజానా శాఖ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బదిలీల విషయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి సహకరించాలన్నారు. గతేడాది 40 శాతం బదిలీల ప్రక్రియ పూర్తి చేశామని, ఈ ఏడాది మరింతగా పెరగాలని ఆయన కోరారు. ఖజానా శాఖ డైరెక్టర్ కె.కనవల్లి మాట్లాడుతూ ఉద్యోగులందరూ నిబద్ధతతో విధులు నిర్వహించి ఖజానా శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యదర్శి రవిచంద్ర అంకితభావంతో ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో అదే విధంగా ప్రతి ఒక్క ఉద్యోగి విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా ఖజానా శాఖ అధికారి లలిత, డిప్యూటీ డైరెక్టర్ హనుమంతరావు, జాయింట్ డైరెక్టర్ శివప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్, కార్యదర్శి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement