రైతు నోట మన్ను కొట్టారు
రైతు నోట మన్ను కొట్టారు
Published Mon, Aug 14 2017 11:59 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
ఇందిరా సాగర్‌పై నోరెత్తని ప్రజాప్రతినిధులు
రాష్ట్ర విభజన నుంచి నిలిచిపోయిన పనులు
తుప్పుపడుతున్న విలువైన యంత్రాలు
ప్రాజెక్టు ఊసెత్తని ఏపీ ప్రభుత్వం
జిల్లాలో 46 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్ధకం
ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిన నిధులు నిరుపయోగం
లక్ష్యం: 2.50 లక్షల ఎకరాలు
మన జిల్లాలో: 46 వేల ఎకరాలు
నిధుల మంజూరు
వైఎస్ హయాంలో : రూ. 1824 కోట్లు
ఖర్చు పెట్టింది: రూ. 900 కోట్లు
2014 నుంచి నిధులు: 0
చేసిన ఖర్చు: 0
చింతలపూడి: ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో 2.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకం అంతర్ రాష్ట్ర జలవివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర విభజన తరువాత ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాంతం ఆంధ్రాలోను, ప్రధాన కాల్వలు తెలంగాణలోను చేరడంతో పథకాన్ని పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరా సాగర్‌ను రీ డిజైనింగ్ చేసి తెలంగాణ అవసరాలకు వినియోగించుకునేలా మార్పులు చేయాలని ఆదేశించడంతో అక్కడి ఇరిగేషన్ అధికారులు ఆపనిలో మునిగి పోయారు. దీంతో మన రాష్ట్రానికి చెందిన పశ్చిమ, కృష్ణా జిల్లాల రైతుల పరిస్ధితి ఆగమ్య గోచరంగా మారింది.
2005లో చింతలపూడి విచ్చేసిన అప్పటి ముఖ్యమంతి డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి ఆనాటి ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ సాగునీటి సమస్యను తీసుకువెళ్లగా ఆయన ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మళ్లించి తద్వారా చింతలపూడి నియోజకవర్గానికి సాగు నీరు అందించడానికి అంగీకరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి రు 1,824 కోట్ల నిధులు మంజూరు చేశారు. అదే ఏడాది డిసెంబర్ నెలలో ఎత్తిపోతలకు శంఖు స్థాపన చేశారు. అనంతరం వేలేరుపాడు మండలం రుద్రమకోటలో గోదావరి, శబరి నదులు కలిసే ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టారు. ప్రాజెక్టు పనులకు విభజనకు ముందు వరకు సుమారు రూ.900 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్ర్ర విభజన తరువాత అసలు సమస్య ప్రారంభమయ్యింది. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ప్రాంతం ఆంధ్రాలో విలీనం చేయడంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఏ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్న దానిపై సందిగ్ధత ఏర్పడింది.
ప్రాజెక్టు రూపకల్పన:
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా రైతులకు సాగు నీరు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేశారు. ఖమ్మం జిల్లాలోని 9 మండలాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాలకు, కృష్ణా జిల్లాలోని 2 మండలాలలో 24.500 ఎకరాలకు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో 46 వేల ఎకరాలకు సాగునీరు అందు అందుతుంది. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో మెగా కిర్లోస్కర్, ఏఎంఆర్ ఇంటర్నేషనల్ సంస్ధలకు అప్పగించారు. 2012 లోనే పూర్తి కావాల్సిన ఎత్తిపోతల పనులు 50 శాతం కూడా పూర్తి కాకుండానే నిలిచిపోయాయి. మొత్తం 47 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, పనులు నిలిచిపోయే నాటికి 38 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. ఎత్తిపోతలకు సంబంధించి మూడు చోట్ల పంప్ హౌస్‌లు నిర్మించడానికి భారీ కందకాలు తవ్వారు. వేలేరుపాడు మండలం అల్లూరినగర్, అశ్వారావుపేట మండలం ఆసుపాక, బండారుగూడెం ప్రాంతాల్లో పంప్‌హౌస్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇంత వరకు పంప్‌హౌస్ పనులు 20 శాతం కూడా పూర్తవ్వలేదు. ఈ పంప్ హౌస్‌ల కోసం జర్మనీ నుండి దిగుమతి చేసుకున్న భారీ మోటార్లు గత 10 ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో 6.8 వేల హెచ్‌పీ సామర్ధ్యం కలిగిన 18 మోటార్లు అవ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామం వద్ద నిరుపయోగంగా వదిలి వేశారు.
నోరు మెదపని ఆంధ్రా ప్రజా ప్రతినిధులు
విభజన సమయంలో ఆంధ్రాలోని నీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల గురించి అప్పటి ప్రజా ప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లక పోవడంతో ప్రాజెకుల్ట పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల రైతుల మధ్య సాగు నీటి వివాదాలు తలెత్తి ఘర్షణలు చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఆంధ్రా కాలువ ద్వాదా తమ్మిలేరుకు వచ్చే వరద నీరు రాకుండా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ఎత్తును పెంచి అక్కడి ప్రజా ప్రతినిధులు అడ్డుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం ఈ వివాదంపై ముగ్గురు రాష్ట్ర స్థాయి రిటైర్డ్ ఇంజినీర్లను నియమించినా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో శాశ్వతంగా గోదావరి జలాలను రాకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ పరిస్ధితుల్లో ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఇరిగేషన్ అధికారులు చర్చించుకుని ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లుయితే తెలుగు రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుంది.
చింతలపూడి ఎత్తిపోతల ద్వారా నీరు :
రాష్ట్ర విభజన వల్ల ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకం ముందుకు సాగే అవకాశం లేదు, చింతలపూడి ఎత్తిపోతల పథకంలోనే తమ్మిలేరుకు గోదావరి జలాలను అందించే ప్రతిపాదన ఉంది. రైతులు అధైర్య పడాల్సిన పని లేదు.
ఎం. అప్పారావు తమ్మిలేరు ఇరిగేషన్ డిఈ
Advertisement
Advertisement