ఎదురుచూపులు ఎన్నాళ్లు!
♦ బిల్లుల కోసం 2,977 మంది పడిగాపులు
♦ ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో ఎడతెగని జాప్యం
♦ ద్విసభ్య కమిటీ తేల్చినా నిధులివ్వని సర్కారు
♦ రెండునెలలుగా ప్రభుత్వం వద్ద ఫైలు పెండింగ్
ఈమె పేరు పంబల్ల శాంతమ్మ. యాచారం మండలం, నల్లవెల్లి. రెండున్నరేళ్ల క్రితం ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. గోడలు స్లాబు లెవల్ వరకు లేచాయి. బిల్లు మాత్రం అందలేదు. రెండేళ్లుగా ఆమె బిల్లు కోసం ఎదురుచూస్తూనే ఉంది. రూఫ్ లేవల్ బిల్లు రూ.35 వేలకుపైగా రావాలి. ఇప్పటికే రూ.లక్షన్నర అప్పు చేశానని, బిల్లిస్తే ఇల్లు పూర్తి చేస్తానని చెబుతోంది శాంతమ్మ. పేదింటి కల సాకారం కాలేదు. ఇందిరమ్మ ఇళ్లకు ఇంకా మోక్షం కలగలేదు. అప్పులుచేసి ఈ పథకం కింద ఇళ్లు కట్టుకున్న బడుగులను ప్రభుత్వం కరుణించడంలేదు. ఇందిరమ్మ పథకంలో అక్ర మాలు జరిగాయని సీఐడీ దర్యాప్తు పేరిట కొన్నాళ్లు కాల యాపన చేసిన సర్కారు.. ఆ తర్వాత అర్హుల గుర్తింపు నెపంతో మరికొంత సమయాన్ని దాటవేసింది. ఆఖరికి ఈ క్రతువు ముగిసి రెండు నెలలైనా నిధులు విడుదల చేయకుండా ఫైలును పక్కనపడేసింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లావ్యాప్తంగా వేలాది మంది పేదలు సొం తింటి కోసం పునాదులు వేశారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో ఈ లబ్ధిదారుల పేర్లు ఆన్‌లైన్‌లో గల్లంతయ్యాయి. ఇందిరమ్మ పథకం కింద బిల్లుల చెల్లింపులన్నీ ఆన్‌లైన్ ద్వారా జరుగుతాయి కనుక.. వీరికి ఇప్పటివరకు నయాపైసా అందలేదు. కనీసం వీరి ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయనే సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర నమోదు కాకపోవడంతో బిల్లులు చెల్లింపులకు సాంకేతిక సమస్య అడ్డొచ్చింది. అంతలోనే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కారు.. ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ పథకంలో బినామీలే ఎక్కువగా ఉన్నారని భావించిన ప్రభుత్వం.. కొత్త ఇళ్ల కేటాయింపులను రద్దు చేసింది. అప్పటికే వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు బిల్లుల చెల్లింపులను కూడా నిలిపివేసింది.
2,877 మంది ఎదురుచూపు
2013లో దాదాపు 3 వేల ఇందిరమ్మ గృహాలను ప్రభుత్వం మంజూరుచేసింది. వీటిలో 50శాతం ఇళ్లు పూర్తి కాగా, మిగతావి అసంపూర్తిగా ఉన్నాయి. అయితే, ఇందిరమ్మ పథకంలో అక్రమాలను వెలికితీసేంతవరకు బిల్లులు నిలిపివేయాలనే ప్రభుత్వ నిర్ణయం వీరికి ఆశనిపాతంగా మారింది. అప్పోసప్పో చేసి ఇళ్లను మొదలు పెట్టిన వారికి బిల్లులు రాకపోవడం వారిని ఆర్థికంగా దిగజార్చింది. చివరకు లబ్ధిదారుల మొర ఆలకించిన ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించేందుకు తహసీల్దార్, ఆర్డీఓ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి అర్హత నిర్ధారించాలని ఆదేశించింది.
ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 2,877 ఇళ్ల శ్లాబ్‌లు పూర్తయినట్లు తేల్చాయి. వీటికి బిల్లులు చెల్లించాలని నిర్దేశించాయి. అదేసమయంలో 8,831 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని అధికారుల కమిటీ గుర్తించింది. ఈ క్రమంలో 2,877 ఇళ్లకు రూ.14 కోట్ల మేర బిల్లులు చెల్లించాలని సిఫార్సు చేస్తూ జిల్లా గృహనిర్మాణశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రెండు నెలల క్రితం ప్రభుత్వానికి చేరిన ఈ ఫైలుకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. ఇందిరమ్మ పథకం కింద పూర్తి చేసుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లిస్తామని పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేస్తున్నా.. నిధుల విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు సర్కారు కరుణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
రూ.40 వేల బిల్లు రావాలె..
రూ. 40 వేల బిల్లు రావాలి. ఇందిరమ్మ ఇళ్లు వచ్చిందన్న సంతోషమే కానీ ఇంటి నిర్మాణానికి అప్పే అయింది. రెండు సార్లు రూ.60 వేల వరకు బిల్లు వచ్చింది. మిగితా రూ.40 వేల కోసం నిత్యం మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. రవాణా చార్జీలే ఖర్చువుతున్నాయి కానీ పైసా బిల్లు మాత్రం రావడం లేదు. రూ.40 వేల బిల్లుఇస్తే ఇంటి నిర్మాణం కోసం తెచ్చి అప్పులకు వడ్డీలైనా చెల్లించుకుంటాం. - పి.లింగమ్మ, (తక్కళ్లపల్లి) యాచారం మండలం