పాల ఉత్పత్తిలో ఇందూరే నెంబర్‌వన్
లింగంపల్లి (సదాశివనగర్):
పాల ఉత్పత్తిలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని విజయ డెయిరీ జిల్లా జనరల్ మేనేజర్ మధుసూదన్‌రావు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 38 వేల క్వింటాళ్ల పశుగ్రాసం విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఆదివారం మండలంలోని లింగంపల్లి గ్రామంలో గల పాల కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పాల ఉత్పత్తిలో ఇందూరు మొదటి స్థానంలో ఉందని.. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి జిల్లాకు 1.14 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. జిల్లాలో 14,158 మంది పాడి రైతులు ఉన్నారని, 323 పాల కేంద్రాలు పని చేస్తున్నాయని, రోజూ 65 వేల లీటర్ల పాల సేకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. లింగంపల్లిలో దాణా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు జీఎంకు విన్నవించారు. సదాశివనగర్ బీఎంసీ మేనేజర్ బాల్‌రెడ్డి, పాల కేంద్రం అధ్యక్షుడు రాములు, కామారెడ్డి డెయిరీ మేనేజర్ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.