రోగుల ప్రాణాలతో చెలగాటం! | injection war bitween surjens, nursess | Sakshi
Sakshi News home page

రోగుల ప్రాణాలతో చెలగాటం!

Published Thu, Sep 29 2016 9:58 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

రోగుల ప్రాణాలతో చెలగాటం!

రోగుల ప్రాణాలతో చెలగాటం!

 
  • పదిరోజులుగా కొనసాగుతున్న సూదిమందు వివాదం
  • ససేమిరా అంటున్న హౌస్‌ సర్జన్‌లు, నర్సులు  
  • ఆందోళనలో రోగులు 
 
సాక్షి, గుంటూరు : పలువురు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఎప్పటికప్పుడు వివాదాస్పదమవుతున్న గుంటూరు జీజీహెచ్‌లో తాజాగా సూదిమందు వివాదం చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా జీజీహెచ్‌లో సూది మందు ఎవరు వేయాలనే అంశంపై హౌస్‌ సర్జన్లు, స్టాఫ్‌ నర్సుల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై పది రోజులుగా హౌస్‌ సర్జన్లు సమ్మె చేస్తున్నారు. దీంతో జీజీహెచ్‌ అధికారులు నర్సింగ్‌ విద్యార్థులతో రోగులకు సూది మందు వేయిస్తున్నారు. గతంలో సైతం ఇదే వివాదం నెలకొనడంతో నిబంధనల ప్రకారం హౌస్‌ సర్జన్లే రోగులకు సూది మందు వేయాలంటూ అప్పట్లో వైద్య అధికారులు స్పష్టం చేశారు. రెండు నెలల క్రితం జ్వరంతో బాధపడుతూ జీజీహెచ్‌కు చికిత్స నిమిత్తం వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య సోదరికి సైతం సూది మందు వేయకుండా రెండురోజుల పాటు వదిలేయడం, తరువాత అధికారులు సర్దిచెప్పి సూది మందు ఇప్పించడం జరిగాయి. ఇలా ప్రతిసారీ సూది మందు ఎవరు వేయాలనే అంశంపై జీజీహెచ్‌లో వివాదం నడుస్తూనే ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో పరిష్కరించడంలో జీజీహెచ్‌ అధికారులు పూర్తిగా విఫలమవుతూ వస్తున్నారు. 
 
చర్యలు తీసుకోవడంలో విఫలం...
జీజీహెచ్‌లో నిబంధనల ప్రకారం రోగులకు హౌస్‌ సర్జన్లు సూది మందు వేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, అధికారులు, అన్ని వైద్య విభాగాల హెచ్‌వోడీలు ముక్తకంఠంతో చెబుతున్నప్పటికీ హౌస్‌ సర్జన్లు సమ్మెను విరమించడం లేదు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన సూపరింటెండెంట్‌ మెతక వైఖరి అవలంబిస్తుండటంతో వివాదం ముదిరి పాకాన పడుతోంది. చర్చల పేరుతో హౌస్‌ సర్జన్లు, స్టాఫ్‌ నర్సులతో సమావేశాలు నిర్వహించడం మినహా కఠినంగా వ్యవహరించడంలో ఆయన పూర్తిగా విఫలం చెందారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాబ్‌ చార్ట్‌ ప్రకారం ఎవరు సూది మందు వేయాలో నిర్ణయించి అందుకనుగుణంగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సూపరింటెండెంట్‌ సమస్యను సాగదీస్తుండటం రోగులకు ఇబ్బందిగా మారింది. 
 
వికటిస్తే బాధ్యులెవరు?
వివాదం తేలేవరకు రోగులకు సూది మందు వేయాలంటూ నర్సింగ్‌ విద్యార్థులకు బాధ్యత అప్పగించడంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారికి అవగాహన లేని నేపథ్యంలో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. 2013లో జీజీహెచ్‌లోని పిల్లల వైద్య విభాగంలో నర్సింగ్‌ విద్యార్థిని సూది మందు వేయడంతో అదికాస్తా వికటించి ఓ బాలుడు మృతి చెందిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. నర్సులు సూది మందు ఎందుకు వేస్తారంటూ అప్పట్లో ఉన్నతాధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడికి సరిపడా సూదిమందు వేయకపోవడం వల్లే ఇలా జరిగిందని తేల్చారు. గత అనుభవాన్ని దష్టిలో ఉంచుకునైనా జీజీహెచ్‌ ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల హౌస్‌ సర్జన్లను చర్చలకు పిలిచిన సమయంలో ఆయా వైద్య విభాగాల హెచ్‌వోడీలు సైతం జాబ్‌చార్ట్‌ ప్రకారం హౌస్‌ సర్జన్లే సూది మందు వేయాలని, తాము సైతం సూది మందు వేసే వైద్యులమయ్యామని, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మరోపక్క హౌస్‌ సర్జన్లు గురువారం కూడా సూపరింటెండెంట్‌ చాంబర్‌ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్టాఫ్‌ నర్సులు కూడా తాము సూది మందు వేసే ప్రసక్తే లేదని, జాబ్‌చార్ట్‌ ప్రకారం ఎవరు వేయాల్సి ఉంటే వారికి అప్పగించాలని తేల్చి చెబుతున్నారు. అలాగాక తమపై బాధ్యత మోపాలని చూస్తే తాము సమ్మెకు సిద్ధమంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జీజీహెచ్‌ ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించాలని వైద్యులు, రోగులు కోరుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement