గుత్తి: గుత్తిలో మొహర్రం సందర్భంగా సోమవారం రాత్రి తలెత్తిన ఘర్షణలో గాయపడిన కుమార్(25) మంగళవారం మరణించినట్లు ఎస్‌ఐ చాంద్‌బాషా తెలిపారు. స్థానిక సీపీఐ కాలనీకి చెందిన కుమార్, రవి, మల్లికార్జున ఉప్పర వీధిలో చిందులు వేస్తుండగా వేణుగోపాల్ అనే వ్యక్తికి కుమార్ కాలు తగిలింది. దీంతో వారిద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. కుమార్‌తో రవి, మల్లికార్జున జత కలసి వేణుగోపాల్‌తో గొడవకు దిగారు.
దీంతో వేణుగోపాల్ తండ్రి నాగరాజు, స్నేహితుడు యుగంధర్ సైతం రంగంలోకి దిగారు. ఘర్షణ పెద్దదై పరస్పరం కొట్టుకున్నారు. అంతలోనే కొందరు మధ్యవర్తులు సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే కాసేపయ్యాక వారు మళ్లీ పరస్పరం దాడులకు దిగారు. కట్టెలతో విచక్షణారహితంగా కొట్టడంతో కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
అక్కడి నుంచి బెంగళూరుకు మంగళవారం సాయంత్రం తరలిస్తుండగా కుమార్ మార్గమధ్యంలోనే మరణించాడన్నారు. దీంతో వేణుగోపాల్, నాగరాజు, యుగంధర్‌పై హత్య కేసు సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా కుమార్ ఏడాది కిందటే సుధారాణి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుధారాణి ప్రస్తుతం గర్భిణి. భర్త మృతి చెందడంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది.