దీక్ష భగ్నం - విరమణ
► నారాయణపేటలో జిల్లా సాధన కోసం
►నిరవధిక నిరాహార దీక్ష
►బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి
► ఆస్పత్రికి తరలించిన పోలీసులు
నారాయణపేట : జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం నారాయణపేటలో తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను అదేరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో ఉన్న వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నాయకులను అరెస్ట్ చేసి మద్దూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనికోసం సుమారు 2.30గంటల ప్రాంతంలో పోలీసు బలగాలను ఇక్కడికి రప్పించారు. దీక్ష చేస్తున్న నామాజీతో పాటు సమితి సభ్యులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఉన్న పీఏసీఎస్ అధ్యక్షుడు తస్యయాదవ్, ఇతర నాయకులు అడ్డుపడగా వారిని అరెస్టు చేసి మరో వాహనంలో మద్దూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగిస్తామంటూ వైద్యానికి సహకరించకపోవడంతో గురువారం ఉదయం సాధన సమితి సభ్యులు, అఖిలపక్షం నాయకులు ఆస్పత్రికి చేరుకుని సముదాయించడంతో దీక్ష విరమించారు. దీక్ష భగ్నాన్ని నిరసిస్తూ గురువారం నారాయణపేటలో బంద్ పాటించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, వైస్ చైర్మన్ నందునామాజీ, ఎంపీపీ మణెమ్మ, జెడ్పీటీసీ అరుణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగపాండురెడ్డి, సాధన సమితి కన్వీనర్ మనోహర్‌గౌడ్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.