ఇద్దరు అంతర్‌జిల్లా నేరస్తుల అరెస్ట్
కొవ్వూరు : ఇద్దరు అంతర్‌జిల్లా నేరస్తులను కొవ్వూరు రూరల్ పోలీసులు మంగళ వారం అరెస్ట్ చేశారు. రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కొవ్వూరు మండలంలోని సీతంపేటలో నవంబర్ 26న రోడ్డు పక్కన పార్క్ చేసిన లారీ అపహరణకు గురైంది. దీంతో లారీ యాజమాని మచ్చా సూర్యనారాయణ అప్పట్లో రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విజయవాడ పోరంకికి చెందిన కడియాల శ్రీనివాసుతో పాటు అతని సోదరుడు కడియాల ఓకార్ ఈ చోరీకి పాల్పడ్డారని గుర్తించి వారిని మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి లారీతోపాటు చోరీ సమయంలో వినియోగించిన అంబాసిడర్ కారును స్వాధీనం చేసుకున్నారు.
సీసీ కెమెరాలతో గుట్టురట్టు
ఈ కేసును సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఛేదించారు. లారీ చోరీకి గురైన రోజు కొవ్వూరు పట్టణంలోని టోల్‌గేట్‌తోపాటు పలుప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో లారీ వెనుక అంబాసిడర్ కారు యర్నగూడెం వరకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఆ కారు నంబర్ సీసీ కెమెరాల్లో పూర్తిస్థాయిలో కనిపించకపోవడంతో విజయవాడకు చెందిన నిపుణుల సాయంతో కారు నంబర్‌ను గుర్తించారు. కారు ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందినదిగా కనుగొన్నారు. దానిని జంగారెడ్డిగూడెంకు చెందిన నిందితుడు శ్రీనివాస్‌కు అమ్మినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ విజయవాడలో ఉంటున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అతని గురించి ఆరా తీశారు. శ్రీనివాస్‌తో, అతని తమ్ముడు ఓంకార్ పాతనేరస్తులని గుర్తించారు. గతంలో లారీల రికార్డులు మార్పు చేసి లోడ్‌లు అమ్ముకుని వీరిద్దరూ పట్టుబడినట్టు తెలుసుకున్నారు. జంగారెడ్డిగూడెం, చాగల్లు, పెనమలూరు, కాకినాడల్లో వీరిపై కేసులు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిందితులపై నిఘా ఉంచిన పోలీసులు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు యర్నగూడెం సమీపంలో పోలేరమ్మ ఆలయం వద్ద లారీతో ఉండగా వారిద్దరినీ పట్టుకున్నారు. లారీకి రంగు మార్చివేసి కర్నాటక రిజిస్ట్రేషన్‌తో దొంగనంబర్ వేసినట్టు పోలీసులు గుర్తించారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై ఎం.శ్యాం సుందరరావు, హెచ్‌సీ ఏకే సత్యనారాయణ, కానిస్టేబుల్ ఎల్.చిరంజీవిని అభినందించారు. వీరికి రివార్డుల నిమిత్తం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు.