
తెలంగాణ టాపర్ ప్రియాంక ఆత్మహత్య
దసరా సెలవులకు ఇంటికి వచ్చిన ఇంటర్ విద్యార్థిని ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
వెంకటాపురం(ఖమ్మం): దసరా సెలవులకు ఇంటికి వచ్చిన ఇంటర్ విద్యార్థిని ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వెంకటాపురంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న చీనాల ప్రియాంక(17) కొత్తగూడెంలోని కృష్ణవేణి కళాశాలలో ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో కళాశాలకు సెలవులు కావడంతో.. ఇంటికి వచ్చింది.
తిరిగి కళాశాలకు వెళ్లడానికి ముందు శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందింది. ఇదిలా ఉండగా.. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ప్రియాంక తెలంగాణ టాపర్‌గా నిలిచింది. చదువులో చురుకుగా ఉండే ప్రియాంక ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రియాంక ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ నోట్ ఏమైనా రాసిందా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు.