అంతర్ రాష్ట్ర నేరస్తుల అరెస్టు
అంతర్ రాష్ట్ర నేరస్తుల అరెస్టు
Published Tue, Jul 25 2017 10:58 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
రూ. 20 లక్షల బంగారు, వెండి వస్తువుల స్వాధీనం
కాకినాడ క్రైం : వారు ముగ్గురూ అంతర్ రాష్ట్ర నేరస్తులు.. రాష్ట్రంలో పలు పోలీస్‌స్టేషన్లలో పోలీసు కేసులున్నాయి.. పగటిపూట సింగిల్‌గా ఉంటున్న ఇళ్లవద్ద రెక్కీ నిర్వహించడం, రాత్రిపూట ఇంట్లో పడి దోచుకోవడం... జైలుకెళ్లడం... బెయిల్‌పై వచ్చి చోరీలకు పాల్పడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న ముగ్గురు అంతర రాష్ట్ర నేరస్తులను ఎట్టకేలకు కాకినాడ క్రైం పోలీసులు పట్టుకున్నారు. నేరస్తుల నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని నేరస్తుల వివరాలను వెల్లడించారు. జిల్లాలో కాజులూరు బ్రాహ్మణ వీధికి చెందిన ముప్పయ్ సంవత్సరాల షేక్ అజీజ్ (నాని), పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట, కొండగూడెంకు చెందిన ఇరవై ఆరేళ్ల అంతర్ రాష్ట్ర నేరస్తుడు చీకట్ల సతీష్, రాజమహేంద్రవరం మల్లిఖార్జునగర్‌కు చెందిన నలభై అయిదేళ్ల షేక్ బాషి (బాషా)లతో కలసి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో 21 ఇళ్లల్లో రాత్రి పూట చోరీలకు పాల్పడ్డారు. ఇందులో షేక్ అజీజ్‌పై గతంలో కాకినాడ, రాజమహేంద్రవరం, పెదపూడి, రాయవరం, అనపర్తి, అన్నవరం, రామచంద్రపురం, ద్రాక్షరామ, అంబాజీపేట, విజయవాడ, భీమడోలు, తణుకు, ఏలూరు జరిగిన 50 చోరీ కేసులలో అరెస్ట్ శిక్ష అనుభవించాడు. చీకట్ల సతీష్ హైదరాబాద్, ఒంగోలు, మచిలీపట్నం, ఏలూరు, కూచిపూడి, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, వైజాగ్, విజయనగరం లో సుమారు 40 కేసుల్లో అరెస్టయి 2016 డిసెంబర్‌లో జైలు నుంచి బయటకు వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. షేక్ అజీజ్ మార్చి నెలలో జైలులో ఉన్న నేరస్తుడు చీకట్ల సతీష్‌ని బెయిల్‌పై తీసుకొచ్చి మరో నేరస్తుడు షేక్ బాషితో కలసి రావులపాలెం, నిడదవోలు,2015 జనవరిలో సర్పవరం కాకినాడ పబ్లిక్ స్కూలు, 2016లో అశోక్‌నగర్ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డారు. చీకట్ల సతీష్ కాకినాడ టూటౌన్ పరిధిలోని రెండు మోటార్ సైకిళ్లు, పశ్చిమగోదావరి జిల్లాలో లక్కవరం, ద్వారకా తిరుమల, నర్సాపురం, సమిశ్రగూడెంలో ఏడు ఇళ్లలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. వీరి ముగ్గురిలో షేక్ అజీజ్‌పై 12 కేసులు, చీకట్ల సతీష్‌పై 12 , షేక్ బాషిపై 3 కేసులలో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నేరస్తులు కాజులూరులో షేక్ అజీజ్ ఇంటిలో ఉన్నట్టు సమాచారం రావడంతో సోమవారం కాకినాడ క్రైం డీఎస్పీ ఏ.పల్లపురాజు ఆధ్వర్యంలో క్రైం ఎస్సైలు కేవీవీ రామారావు, జి.హరీష్‌కుమార్‌ల ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేశారు. 500 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలు, 9.323 కిలోల వెండి ఆభరణాలు, రెండు మోటార్ సైకిల్స్, ఒక ఎల్‌ఈడీ టీవీని నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడటం, గంజాయి అక్రమ రవాణా, మిలీషియా çకమాండర్ అరెస్ట్, దొంగతనాల రికవరీలలో సిబ్బంది మంచి ఫలితాలు సాధిస్తున్నారని కితాబిచ్చారు. క్రైం డీఎస్పీ పల్లపురాజు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
Advertisement