అందరూ అక్షరాస్యులే అయినా.. | invalid votes 18363 in graduates mlc elections | Sakshi
Sakshi News home page

అందరూ అక్షరాస్యులే అయినా..

Published Wed, Mar 22 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

అందరూ అక్షరాస్యులే అయినా..

అందరూ అక్షరాస్యులే అయినా..

అనంతపురం అర్బన్‌ : పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదో విచిత్రం.  ఓటు హక్కు కలిగిన వారందరూ విద్యావంతులే. డిగ్రీ, డిప్లొమా కనీస విద్యార్హత కల్గినవారు. అయితే.. ఓటు ఎలా వేయాలనే దానిపై పలువురికి అవగాహన లేదనే విషయం స్పష్టంగా కన్పిస్తోంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు  ఏకంగా 18,363 నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1,55,711 ఓట్లు పోలయ్యాయి. రౌండ్‌కు 26 వేల  చొప్పున ఆరు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండ్‌లోనూ చెల్లని ఓట్లు మూడు వేల వరకు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వినియోగించుకోవాలి? ప్రాధాన్యతా క్రమంలో ఓటు ఎలా వేయాలి? ఓటు ఎలా చెల్లకుండా పోతుందనే అంశాలపై ఎన్నికల సంఘం, అధికారులు, అభ్యర్థులు విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు.

అయినా కూడా కొందరు అవగాహన లేకుండా ఓటు వేశారు. దీంతో భారీసంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోయాయి. మొదటి ప్రాధాన్యత (1) ఓటు తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. పోలింగ్‌ కేంద్రంలో ఇచ్చిన వైలెట్‌ రంగు స్కెచ్‌ పెన్‌తోనే అంకెలు వేయాలి. అయితే.. చాలా మంది రైట్‌ మార్క్‌ వేశారు. మరికొందరు సొంత పెన్‌ వాడారు. ఇలాంటి ఓట్లు ఐదు వేల వరకు ఉన్నాయి. అలాగే కొందరు తాము మొదటి ప్రాధాన్యత ఓటు వేయదల్చుకున్న అభ్యర్థుల ముందు ‘1’ అంకె వేయకుండా అభ్యర్థి వరుస సంఖ్యను అతనికి కేటాయించిన గడిలో నమోదు చేశారు. ఇలాంటివి దాదాపు రెండు వేల వరకు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే విద్యావంతులు అయ్యి ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై అవగాహన పెంచుకోలేదనే విషయం స్పష్టమైంది.

నోటాకు 1,576 ఓట్లు
    పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా (నన్‌ ఆఫ్‌ ద అబవ్‌) గుర్తుకు 1,576 ఓట్లు వచ్చాయి. మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో ఏ ఒక్కరూ సరైన వ్యక్తిగా తాము భావించడం లేదంటూ 1,576 మంది తమ అభిప్రాయాన్ని నోటా ద్వారా తెలియజేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement