జెడ్పీ చైర్మన్ అంటే లెక్క లేదా?
- స్పోర్ట్స్ మీట్ నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకోండి
- డీఈఓను కోరిన చైర్మన్ మల్లెల రాజశేఖర్
కర్నూలు(అర్బన్): నందవరం మండల కేంద్రంలో 28 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ ఆహ్వాన పత్రికల్లో తన పేరును విస్మరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ కోరారు. ఈ నెల 30వ తేదిన ' సాక్షి ' దినపత్రికలో ప్రచురితమైన ' జెడ్పీ స్కూల్ స్పోర్ట్స్ మీట్‌లో చైర్మన్‌కు దక్కని గౌరవం ' అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కార్యాలయ పని నిమిత్తం తన వద్దకు వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథరెడ్డికి తనకు అందిన ఆహ్వాన పత్రికను చూపిస్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జెడ్పీ వైస్ చైర్మన్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకుల పేర్లను ఆహ్వాన పత్రికలో ముద్రించి తనను విస్మరించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై డీఈఓ మాట్లాడుతూ అక్కడ స్కూల్ ప్రధానోపాధ్యాయుడే ఇన్‌చార్జీ ఎంఈఓగా వ్యవహరిస్తున్నారని, ఎందుకు ఇలా జరిగిందో విచారిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ డీఈఓనుకోరారు.