కోన తీరంలో కొండంత అండ
సాక్షిప్రతినిధి, కాకినాడ : కోనతీర ప్రాంత దివీస్ బాధిత గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొండంత అండనిచ్చింది. 85 రోజులుగా దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా 13 గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనతో అలసిపోయిన
కాలుష్య పరిశ్రమకు వ్యతిరేకంగా కెరటంలా ఎగిసింది ఆగ్రహం. దౌర్జన్యాలు ఇంకానా ఇకపై చెల్ల వంటూ గర్జించింది జన సంద్రం. బాధిత గ్రామాలకు మద్దతుగా వేలాదిగా ప్రజలు తరలిరావడంతో మొండి వైఖరితో ముందుకు పోతున్న పాలకవర్గానికి ఓ బలమైన హెచ్చరిక పంపించినట్టయింది. జగన్ భరోసా మరింత పోరాట పటిమను పెంచింది.
బాధితుల్లో మనో ధైర్యాన్నిచ్చిన జగన్ పర్యటన
ఎడ్లబళ్లపై తరలి వచ్చిన జనం
రోడ్డు మార్గంలో జన నీరాజనం
ఉద్వేగ భరితంగా ప్రసంగం
ఆద్యంతం కరతాళ ధ్వనులే...
సాక్షిప్రతినిధి, కాకినాడ : కోనతీర ప్రాంత దివీస్ బాధిత గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొండంత అండనిచ్చింది. 85 రోజులుగా దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా 13 గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనతో అలసిపోయిన బాధితులకు జగన్ మద్దతు మనో ధైర్యాన్నిచ్చింది. పోలీసుల వేధింపులు, అధికార పార్టీ ఆగడాలతో మానసికంగా తీవ్ర ఆందోళన చెందిన బాధితులకు జగన్ ప్రసంగం పోరాట స్ఫూర్తిని మరింత నింపింది. తమ భూములు ఇచ్చేది లేదని గొంతెత్తిన వారిపై పోలీసు ప్రదర్శించిన దాషీ్టకాలను దానవాయిపేట వేదికపైకి ఒక్కొక్కరు వెళ్లి కన్నీటి పర్యంతమై చెబుతుంటే జనంతోపాటు జగన్ చలించిపోయారు. జగన్ ప్రసంగంల ఆద్యంతం ఉద్వేగ భరితంగా సాగింది. ‘మీకు నేనున్నాను, ఆ పరిశ్రమ ఇక్కడ పెట్టనిచ్చేది లేదు, చంద్రబాబు అండ చూసుకుని ఫ్యాక్టరీ పెడితే వదిలేదిలేదని హర్షధ్వనాల మధ్య భరోసా ఇచ్చారు. హేచరీలకు పొంచి ఉన్న ముప్పు, కోల్పోయే విదేశీ మారకద్రవ్యం, వేలాది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి గణాంకాలతో సహా జగన్ వివరించినప్పుడు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది.
పారని కుయుక్తులు...
దానవాయిపేట సభ విజయవంతం కాకూడదని అధికార పార్టీ నేతలు ఎన్ని కుయక్తులు పన్నినా జనం మాత్రం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి అధికారపార్టీ నేతలు దానవాయిపేట సభకు వెళితే పింఛన్లు రేషన్ కార్డులు రద్దు చేస్తామని ఊరూరా తిరుగుతూ ప్రచారం చేశారు. అయినా దాదాపు అన్ని గ్రామాల నుంచి బా«ధితులు పెద్ద ఎత్తున పిల్లాపాపలతో తరలివచ్చి విజయవంతం చేశారు. పోలీసులు పలు ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టినా, అధికార పార్టీ నేతలు గ్రామగ్రామాన ప్రతిబంధకాలు కల్పించినా సభ విజయవంతం కాకుండా అడ్డుకోలేకపోయారు. బాధితుల పట్ల పోలీసులు అనురిస్తున్న తీరును జగన్ తన ఉపన్యాసంలో ఎండగట్టారు. నెత్తిన పెట్టుకున్న టోపీకి ఉన్న సింహాలు వెనుక ఉన్న గుంటనక్కలు మాటలు వినకండంటూ జగన్ పోలీసులకు చురకలు అంటించారు.
అడుగడుగునా ఘన స్వాగతం...
మధ్యాహ్నం రెండున్నర గంటలకు మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్ మోహన్‌రెడ్డి నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. నరేంద్రపురం వద్ద మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ సిటీకి చెందిన మత్స్యకార నాయకుడు మత్సా గంగాధరరావు, అతని తనయుడు లోకేష్‌కు వైఎస్సార్ సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దోసకాయలపల్లిలో రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో గిరిజనులు జగన్ ను కలిశారు. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా జగ్గంపేటకు చేరుకోగా పార్టీ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాసు, అన్నవరం గ్రామంలో కో ఆర్డినేర్ పర్వత ప్రసాద్ ఆధ్వర్యంలో మేళతాళాలతో, బాణసంచా కాల్చుతూ పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు పూలతో ముంచెత్తారు. అన్నవరం సెంటర్‌లో స్థానికులు అభిమానంతో అడ్డంపడి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తరువాత కొద్ది సేపు మాట్లాడాలని పట్టుబట్టారు. దీంతో కాన్వాయ్ దిగి వెళ్లి అంబేడ్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించి స్థానికుల కోరిక కాదనకుండా మీ ఆత్మీయతకు, ఆప్యాయతను మరిచిపోలేనంటూ కొద్దిసేపు ప్రసంగించారు. అక్కడి నుంచి గోపాలపట్నం, కొత్తపల్లి, శృంగవృక్షం, తొండంగి గ్రామాల మీదుగా దానవాయిపేట చేరుకున్నారు. మధురపూడి ఎయిర్ పోర్టు నుంచి దానవాయిపేట వరకు అడుగడుగునా పార్టీ అభిమానులు బ్రహ్మ రథం పట్టారు.