హామీలు నెరవేరలేదు.. | Jailbaro held by the CPI ahead of Monday's collectorate. | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేరలేదు..

Published Tue, Jul 25 2017 5:26 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

హామీలు నెరవేరలేదు..

హామీలు నెరవేరలేదు..

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్‌
లెక్టరేట్‌ ఎదుట సీపీఐ జైల్‌భరో
నాయకుల అరెస్టు.. విడుదల

ఆదిలాబాద్‌అర్బన్‌: అధికారంలోకి రాకముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ నెరవేరలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్‌ అన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ వల్ల దేశంలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతోందని విమర్శించారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో జైల్‌భరో నిర్వహించారు.

ముందుగా పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి పలు చౌక్‌ల గుండా ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గుండా మల్లేష్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో వ్యవసాయ సంక్షోభం నివారణకు రూ.లక్ష కోట్ల నిధితో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో 70 నుంచి 80 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని, అందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని రైతులు మొరపెట్టుకుంటే లాఠీచార్జీలు, బేడీలు వేయిస్తున్నారని అన్నారు.


మోదీ ప్రభుత్వం గోరక్షణ పేరుతో దౌర్జాన్యాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి భూములు లాక్కోవద్దని, వారికి పట్టాలు ఇచ్చి భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. స్వామినాథన్‌ కమిషన్, జయతీఘోష్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయాలని, వ్యవసాయ సంబంధ వస్తువులు, విత్తనాలు, ఎరువులను జీఎస్టీ నుంచి మినహాయించాలని అన్నారు. 2013 భూసేకరణ, నిర్వాసితుల చట్టాన్ని అమలు చేసి నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని పేర్కొన్నారు

. రైతులను రుణవిముక్తులను చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి 14 రకాల నిత్యావసరాలను పంపిణీ చేయాలని, పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లోని సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పశువధ నిషేధ చట్టాన్ని రద్దు చేయాలని అన్నారు. కాగా, కలెక్టరేట్‌ లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్‌ చేసి టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.విలాస్, నాయకులు ముడుపు నళినిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement