-
నేతల అరెసై్టనా రోడ్డెక్కిన బాధిత గ్రామాల ప్రజలు
-
పంపాదిపేట బీచ్‌రోడ్డుపై ఆందోళన
-
దివీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు
-
ఆందోళనకారులపై పోలీసుల హుకుం
-
పంపాదిపేటలో సభ జరగకుండా అడ్డుకున్న పోలీసులు
-
సీపీఎం, సీపీఐ(ఎం.ఎల్),ఐద్వా సంఘం మహిళలతో పాటు నేతల అరెస్టు
తొండంగి / పిఠాపురం :
కోన తీరంలో తలపెట్టిన దివీస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పంపాదిపేట బీచ్‌రోడ్డుపై బాధిత గ్రామాల ప్రజల ఆగ్రహం మరోసారి పెల్లుబికింది. కొద్ది రోజుల క్రితం దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కోన తీర ప్రాంతంలో బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన చే సిన సంగతి విదితమే. పంపాదిపేట వద్ద పోలీసుల అరెస్టు, లాఠీచార్జి సంఘటనల నేపధ్యంలో బాధిత గ్రామాల్లో పది రోజులపాటు విధించిన 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. బాధిత గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం పంపాదిపేటలో బహిరంగ సభ నిర్వహించేందుకు అఖిల పక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో మంగళవారం వివిధ పరిణామాలు చోటుచేసుకుని చివరకు బాధిత గ్రామాల ప్రజలు బీచ్‌రోడ్డుపై దివీస్‌కు వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపించారు.
భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు...
అఖిలపక్ష నేతలు ఇచ్చిన పిలుపు మేరకు సభ జరుగుతుందని భావించిన పోలీసులు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో సోమవారం రాత్రికే జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి పోలీసులను ఒంటిమామిడి వద్దకు భారీ సంఖ్యలో తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం నుంచే మండలంలోని నలువైపులా ప్రధాన రహదారుల వద్ద బందోబస్తును ఏర్పాటు చేసి సభకు హాజరయ్యే వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. దీంతో తొండంగి ప్రధాన రహదారిలో ఏ.కొత్తపల్లి వద్ద, కృష్ణాపురం జంక్షన్ వద్ద, బీచ్‌రోడ్డులో తాటియాకులపాలెం, పెరుమాళ్లపురం పరిసర ప్రాంతాల్లో పోలీసులను బందోబస్తు పెట్టారు. వచ్చీపోయేవాహనాలను తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ™ èlనిఖీల నేపధ్యంలో సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఖాకీల దండుతో కోనప్రాంతం ఉలిక్కిపడింది.
పంపాదిపేటలో నేతల బలవంతపు అరెస్టులు...
దివీస్ వ్యతిరేకిత గ్రామాల ఆందోళనకు మద్దతుగా సభ నిర్వహించేందుకు పంపాదిపేట రామాలయం వద్దకు సీపీఎం, సీపీఐ (ఎం.ఎల్. లిబరేషన్), పి.వి.రావు మాలమహానాడు సంఘం, ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) నేతలతోపాటు బాధిత గ్రామాల ప్రజలు చేరుకున్నారు. అప్పటికే అడిషనల్ ఎస్పీ దామోదరం ఆధ్వర్యంలో అక్కడకు పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. రామాలయం వద్ద బహిరంగ సభ జరపడానికి అనుమతులు లేవని, సభ పెట్టడం కుదరదని డీఎస్పీ, సీఐలు చర్చలు జరిపారు. సభ నిర్వహణకు అనుమతి కోసం జిల్లా పోలీసులు అధికారులకు దరఖాస్తు చేశామని, తాము ఎటువంటి ఆందోళన చేయకుండా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సభను నిర్వహించుకుంటామని నేతలు వివరించారు. సుమారు గంట సేపు ఈచర్చలు, వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపధ్యంలో సభకు వచ్చిన ఐద్వా సంఘం మహిళా నేతలు, బాధిత గ్రామాల మహిళలు బైఠాయించి ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘దివీస్ పరిశ్రమ తమకు వద్దంటూ’ ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, పి.వి.రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పండు అశోక్, సీపీఐ(ఎం.ఎల్.లిబరేషన్) జిల్లా కార్యదర్శి బుగతా బంగార్రాజు, సీపీఐ ఎంఎల్ తుని ఏరియా కోఆర్డినేటర్ శివకోటిరాజు, కె.జనార్ధన్, మాజీ జెడ్పీటీసీ అంగుళూరి అరుణ్‌కుమార్ తదితర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మహిళల ఆందోళన తీవ్రతరం చేయడంతో మహిళలను జడపట్టుకుని లాగుతూ, వస్త్రాలను పట్టుకుని విచక్షణా రహితంగా లాగి వ్యానులోకి కుక్కారు. శాంతియుత వాతావరణంలో సభ నిర్వహించుకునేందుకు వస్తే పోలీసులు జులుం ప్రదర్శించి, దౌర్జన్యంగా తమను అదుపులోకి తీసుకున్నారంటూ ఉద్యమకారులు మండిపడ్డారు. ఈ సంఘటనలో ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్.రమణి, ఇతర సభ్యులు సుభాషిణి, ఇతర మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
బండిపై వెళ్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శిపై దురుసుతనం
సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ మహిళా కానిస్టబుల్ మధు చొక్కాను లాగడంతో స్కూటర్ అదుపు తప్పింది. కిందపడేలోగానే ఎలాగోలా బైక్ అదుపుచేసి నిలిపే లోపే మిగిలిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బలవంతంగా లాక్కెళ్లి జీపులో ఎక్కించారు. ఆయనతోపాటు సీపీఎం జిల్లా నాయకులు అప్పారెడ్డి, మరొకొంత మందిని అదుపులోకి తీసుకుని కాకినాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పలువురి మందుస్తు అరెస్టులు...
M సభకు హాజరయ్యేందుకు వస్తున్న పలువురిని పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. తునిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెటి ్టరాజాను, పెరుమాళ్లపురంలో సీఐటీయూ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బీబీరాణి, ఏ.కొత్తపల్లిలో మాజీ ఎం.పీ హర్షకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
బీచ్‌రోడ్డుపై నిరసన గళాలు...
పంపాదిపేట రామాలయం వద్ద బహిరంగ సభను జరగనివ్వకుండా పోలీసులు ముఖ్య నేతలను, మహిళా సంఘం నేతలతోపాటు ఇతర మహిళలను అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇది జరిగిన గంటసేపటికి పాఠశాల భవనం సమీపంలో వీధుల్లో బాధిత గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. సీపీఎం అనుబంధ సం«స్ధ వ్యవసాయ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం అడ్డగోలుగా భూసేకరణ చేపట్టిందని, ఇక్కడి రాజకీయ నాయకుల పోత్సాహంతోనే పరిశ్రమ ఏర్పాటు జరుతుందన్నారు. ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా, హెచరీల్లో ఉపాధి పొందుతున్న యువతకు పత్నామ్నాయ ఉపాధి కల్పించకుండా అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారంతా పాదయాత్రగా సుమారు కిలోమీటరు వరకూ బీచ్‌రోడ్డు గుండా దివీస్ భూముల వరకూ వచ్చారు. అక్కడ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కాసేసు తోపులాట జరిగింది. నరసింహరావు కొంత అస్వస్ధతకు గురయ్యారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలంతా అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈలోపుగా ఒంటిమామిడి, పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసులను వ్యాన్లపై రప్పించి ఆందోళనకారులను చుట్టుముట్టారు. సుమారు మూడొందల మందికిపైగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. డీఎస్పీ రాజశేఖర్ ఆదేశాలతో నరసింహారావును పోలీసులు మోసుకుంటూ వాహనంలో ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మరో 20 మంది వరకూ ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తీరంలో 144 సెక్షన్‌ను పోలీసులు కొనసాగిస్తున్నారు.
మత్స్యకారుల నిరసన...
శాంతియుతంగా పంపాదిపేటలో జరిగే బహిరంగ సభకు తమ మత్స్యకారులను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ నర్సిపేటలో మత్స్యకారులు నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు మేరుగు ఆనందహరి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చొక్కా కాశీలతోపాటు సుమారు రెండొందలమంది మత్స్యకారులు నిరసన తెలిపారు. అనంతరం కొందరి మత్స్యకారులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆందోళన చేస్తామని మత్స్యకార నాయకులు హెచ్చరించడంతో వారిని వదిలేశారు.