రాష్ట్రవ్యాప్తంగా బంద్ విజయవంతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు అన్ని జిల్లాల వ్యాప్తంగా బంద్ విజయవంతంగా ముగిసింది. బంద్‌లో పాల్గొన్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. అయినా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. వాణిజ్య, వ్యాపార సంస్థలు పనిచేయలేదు. విద్యా సంస్థలను మూసివేశారు.
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ నాయకులు బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. నేతలు వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పార్థసారథి, పి.గౌతంరెడ్డి, నాగిరెడ్డి తదితరులు ఆర్టీసీ ప్రయాణికులు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బందికి గులాబీలు ఇచ్చి బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఆర్టీసీ బస్సుల్లో వీరి ప్రచారానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా పార్థసారథితోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో బంద్ పాటించాలని కోరుతున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా పది మంది పార్టీనేతలను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి మంగళగిరి ఆర్టీసీ డిపో నుంచి బయటకు బస్సులు రాకుండా అడ్డుకున్నారు. బస్టాండ్ ఎదుట రెండు గంటలపాటు ధర్నా చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే ఆర్కే సహా నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో స్థానిక యువకులు బైక్ ర్యాలీ చేపట్టారు. బంద్‌కు సహకరించాలని పట్టణంలో తిరుగుతూ ప్రజలను కోరారు.
సత్తెనపల్లిలో బంద్ పాటి ంచాలని కోరుతూ నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు 20 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున ఆందోళకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లా రేపల్లెలో బంద్ పాటిస్తున్న పార్టీ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌కుమార్, మైనారిటీ నేత షేక్ సుభానీ తదితర వైఎస్సార్సీపీ నేతలు 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సహా నాయకులు ధర్నాకు దిగారు. బస్సులు బయటకు రాకుండా ఆందోళన చేపట్టారు.
వైఎస్సార్ జిల్లా కేంద్రంలో కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు బస్టాండ్‌వద్ద ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
చిత్తూరు జిల్లా నారాయణవనంలో హైవేపై వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలం సురేష్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు.
పీలేరులో బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా 200 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో నిరసనలు, ఆందోళనలతో పీలేరు పట్టణ బంద్ విజయంతమైంది.
కాణిపాకంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్‌రెడ్డి, నేతలు చిన్నారెడ్డి, భాస్కరయ్య, ఆర్ముగం, అజీజ్ తదితరులను అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు.
మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకుని, ఆయన్ను స్టేషన్‌కు తరలించారు.
కడప జిల్లా రాయచోటి బంద్‌లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. స్థానిక నేతలతో కలిసి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు.
జమ్మలమడుగులో బంద్ ప్రశాంతంగా ముగిసింది. వాణిజ్య, వ్యాపారసంస్థల వారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బస్సులను ఆపేశారు.
కృష్ణా జిల్లా నూజివీడులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట నాయకులు బైఠాయించారు. దీంతో బస్సులు బయటకు రాలేదు. బంద్‌కు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి.
అనంతపురం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి సహా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైఎస్సార్సీపీ నేతలు రాస్తారోకో చేపట్టారు.
తమ్మినేని సీతారాం సహా పార్టీనేతలను పోలీసులు అరెస్టు చేశారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన చేస్తున్న పార్టీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. సుమారు 12మంది నేతలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
విశాఖ జిల్లా కేంద్రం మద్దిలపాలెంలో ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేస్తున్న గుడివాడ అమర్నాథ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌కు సహకరించాలని కోరుతూ తాటిచెట్లపాలెంలో వైఎస్సార్సీపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్టీసీ డిపోను ముట్టడించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత, వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వామపక్షల పార్టీల నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు.