రాష్ట్రంలో నియంతృత్వ పాలన
రాష్ట్రంలో నియంతృత్వ పాలన
Published Thu, Jul 27 2017 11:42 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
–వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
కడియం : రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. కడియం మండలం వేమగిరిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు స్వగృహంలో గురువారం ఆమె విలేకర్లుతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లోకి చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు కాపులను మోసగించారన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు. వేలాది మంది పోలీసులను రోడ్డు ఎక్కించారని రాష్ట్రంలో న్యాయం కోసం ఎవరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా పోలీస్‌స్టేషన్‌లో ఎవరూ లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే అది మరింత ఎగిసిపడుతుందన్నారు. 72 గంటల్లో ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. దివంగత నేత వంగవీటి మోహనరంగా హత్యానంతరం ప్రభుత్వానికి ప్రజలు చెప్పిన విధంగానే రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర హోంశాఖామంత్రి నిమ్మకాల చినరాజప్పను చంద్రబాబునాయుడు కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ అధికారంలో ఉన్న నాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి కాపుల కోసం పోరాడిన ఘనత ముద్రగడ పద్మనాభానికి ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు మాట్లాడుతూ ముద్రగడను విమర్శించే అర్హత మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావుకు లేదని పేర్కొన్నారు.
Advertisement