-
రెండున్నరేళ్లయినా ఇంతేనా? ∙సమస్యలు పరిష్కరించేదెప్పుడు?
-
∙‘సంక్షేమం’లో ఏమిటీ ‘పచ్చ’పాతం? ∙అడుగడుగునా నిలదీసిన జనం
-
∙ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తికి అద్దం పట్టిన గ్రామసభలు
-
∙పలుచోట్ల పలుచగా హాజరైన ప్రజానీకం
రెండున్నరేళ్లుగా సమస్యలు పరిష్కారం కాకపోవడం.. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం చూపిస్తున్న ‘పచ్చ’పాతంపై జనాగ్రహం వెల్లువెత్తింది. నాలుగో విడత జన్మభూమి గ్రామసభలు సాక్షిగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులను.. అధికారులను నిలదీశారు. తమ కష్టాలను గట్టెక్కించని జన్మభూమి గ్రామసభలు దేనికంటూ ప్రశ్నించారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పెదవి విరుపులు.. నిలదీతలు.. బైఠాయింపులు.. బహిష్కరణలు.. ఇలా సోమవారం ప్రారంభమైన నాలుగో విడత జన్మభూమి సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవే దృశ్యాలు కనిపించాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మూడు విడతల జన్మభూమి సభలు పెట్టారు. అప్పుడిచ్చిన దరఖాస్తులకే ఇంతవరకూ దిక్కూమొక్కూ లేదు. మరోసారి జన్మభూమి
పెట్టి వాటినైనా పరిష్కరిస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో ఈ గ్రామసభలు దరఖాస్తులు తీసుకోవడానికేనా అని జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
ఆసక్తి చూపని జనం
పింఛన్లు, రేష¯ŒSకార్డులు, ఇళ్ల రుణాలు ఇస్తామని ప్రభుత్వం ఊదరగొట్టినా ఈసారి జన్మభూమిపై జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. పరిష్కారం లభిస్తుందనే నమ్మకం లేనందువల్ల నే ప్రజల హాజరు పలుచబడింది. దీనిని కప్పిపుచ్చుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు అప్పటికప్పుడు నానాతంటాలూ పడటం కనిపించింది. కోరుకొండ, జగ్గంపేట మండలం గొల్లగుంట జన్మభూమి సభలు జనం లేక వెలవెలబోయాయి. వచ్చినవారు కూడా పింఛన్లకోసమే వచ్చినట్టు ఉందంటూ గొల్లగుంటలో స్వయంగా అధికారులే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కోరుకొండ జన్మభూమికి ఆశించిన స్థాయిలో జనం రాలేదు. గత్యంతరం లేక అప్పటికప్పుడు విద్యార్థులను తీసుకువచ్చి మమ అనిపించేశారు. జిల్లాలోని పలు ఇతర ప్రాంతాల్లో జరిగిన గ్రామసభల్లో కూడా జనం పెద్దగా లేకపోవడం కనిపించింది.
అడవిబిడ్డల ఆగ్రహం
∙‘‘మూడు జన్మభూమి కార్యక్రమాల్లో పింఛన్లు, రేష¯ŒSకార్డులు, పోడుభూమి పట్టాల కోసం తిరుగుతున్నాం. మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేనప్పుడు నాలుగో విడత జన్మభూమి ఎందుకు’’ అంటూ ప్రజల తరఫున చింతూరు మండలం తులసిపాకలులో ఎంపీపీ చిచ్చడి మురళి అధికారులను నిలదీశారు. వచ్చే జన్మభూమినాటికైనా పరిష్కరించకుంటే ఊరి పొలిమేర్లకు కూడా రానివ్వబోమని హెచ్చరించారంటే విలీన మండలాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
∙ఎటపాక మండలం గుండాలలో గత జన్మభూమి సందర్భంగా ఇచ్చిన విజ్ఞాపనలు ఏమయ్యాయో చెప్పాలని గిరిజనులు అధికారులను ప్రశ్నించారు. అర్హులకు కూడా పింఛన్లు రద్దు చేయడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
∙గత జన్మభూమిలో చెప్పిన సమస్యలు ఇంతవరకూ పరిష్కరించలేదని చింతూరు మండలం చిడుమూరులో ప్రజలు ఐటీడీఏ పీవో గుగ్గిలి చినబాబును ప్రశ్నించారు.
∙రాజవొమ్మంగి మండలం లోతట్టు గ్రామం వాతంగిలో కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందుల పాలే్జస్తున్న అధికారుల తీరుతో విసుగెత్తిపోయిన వాల్మీకి గిరిజనులు విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. తహసీల్దార్‌ను ఘెరావ్ చేశారు.
ఇంకా..
∙గత జన్మభూమిలో పింఛన్లు, రేష¯ŒSకార్డుల కోసం ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని, వాటి సంగతి తేల్చకుండా, మరోసారి జన్మభూమి ఎందుకంటూ కోటనందూరు మండలం ఎస్‌ఆర్ పేట గ్రామసభలో అధికారులను, ప్రజాప్రతినిధులను స్థానికులు నిలదీశారు.
∙రామచంద్రపురం మండలం భీమక్రోసుపాలెంలో అర్హులైనవారికి ఇళ్లస్థలాలు ఇవ్వడంలేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
∙కరప మండలం అరట్లకట్ట జన్మభూమిలో 100 రోజుల పనిదినాలు కల్పనగానే మిగిలిందని నినదించిన కూలీల గొంతును పోలీసు బలంతో నొక్కేశారు.
పబ్లిక్‌గా బయటపడిన ‘పచ్చ’పాతం
∙కోనసీమ ముఖద్వారం రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు జన్మభూమి గ్రామసభ వేదికగా అధికార పార్టీ ‘పచ్చ’పాతం పబ్లిక్‌గా బయటపడింది. ఆ మండలంలో పింఛన్ల కోసం 900 మంది దరఖాస్తు చేసుకుంటే 500 మంజూరయ్యాయి. అందులో జన్మభూమి జరుగుతున్న ముమ్మిడివరప్పాడులో 16 మంది దరఖాస్తు చేసుకుంటే తొమ్మిది మంజూరయ్యాయి. వీటిల్లో ఐదు మాత్రమే ఖరారు చేసినట్టు సభలో అధికారులు ప్రకటించారు. ఆ ఐదూ కూడా తెలుగు తమ్ముళ్లు సభ్యులుగా ఉన్న జన్మభూమి కమిటీలు చెప్పిన టీడీపీవారికే కట్టబెట్టారు. అర్హులు ఎంతోమంది ఉంటే ‘తమ్ముళ్ల’కే కట్టబెట్టడమేమిటంటూ వేదికపై ఉన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు.
∙రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండల స్త్రీశక్తి భవనంలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మరో అడుగు ముందుకేశారు. కొత్తగా మంజూరు చేస్తున్న పింఛన్లను తనకు, టీడీపీకి వ్యతిరేకంగా పని చేసినవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరాదని సూచించారు.
డిప్యూటీ సీఎం సాక్షిగా
ప్రొటోకాల్ ఉల్లంఘన
పెద్దాపురం మండలం వడ్లమూరులో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలోనే మహిళా ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది. ఇక్కడ సంక్షేమ పథకాల పంపిణీలో స్థానిక సర్పంచ్ పాలచర్ల రమాదేవికి బదులు ఆమె భర్త ఉమామహేశ్వరరావు (బుజ్జి), ఎంపీటీసీ సభ్యురాలు చల్లా జయంతికి బదులు ఆమె భర్త చల్లా శ్రీనివాస్‌లు డిప్యూటీ సీఎంతోపాటు పాల్గొనడం చర్చనీయాంశమైంది.