ఆపన్నులకు చేయూత
ముద్దులొలికే చిన్నారులు... విధివశాత్తు అంగ వైకల్యంతో పుట్టారు. 12 ఏళ్లయినా శరీర ఎదుగుదల లేక మరొకరిపై ఆధారపడ్డారు. పలు ప్రాంతాల్లో చికిత్సలు చేయించినా డబ్బు ఖర్చు తప్ప ఫలితం కనిపించలేదు. వీరి పోషణ నిరుపేద తల్లిదండ్రులకు భారమైంది. విషయం తెలుసుకున్న స్వామి జపానందా వారిని అక్కున చేర్చుకున్నారు.
పావగడ తాలూకాలోని కొత్తూరు గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు అళ్లప్ప, మల్లమ్మకు శిల్ప, మంజుల అనే పిల్లలు ఉన్నారు. అంగవైకల్యంతో జన్మించిన వీరి ఆలనాపాలనకు ఎవరో ఒకరు కచ్చితంగా ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలకు వీరి పోషణ భారమైంది. కంటి ముందర పాకుతున్న 12 ఏళ్ల పిల్లలను చూస్తూ కన్నీటి పర్యాంతమవడం తప్ప ఏమీ చేయలేని అసహాయ స్థితి ఆ తల్లిదండ్రులది.
ఈ విషయం తెలుసుకున్న స్వామి జపానంద బుధవారం వారి ఇంటికి వెళ్లి ఇద్దరు అమ్మాయిలను పరామర్శించారు. కుటుంబ పరిస్థితులు తెలుసుకుని పిల్లలకు నెలవారీ అయ్యే ఖర్చులకు తానే భరిస్తానంటూ భరోసానిచ్చారు. అలాగే కొత్తూరులో త్వరలో మొబైల్ వైద్యసేవలకు హామీనిచ్చారు.