రైతులకు అందుబాటులో కే–9 | k9 groundnut available of farmers | Sakshi
Sakshi News home page

రైతులకు అందుబాటులో కే–9

Published Sun, Jan 1 2017 11:14 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రైతులకు అందుబాటులో కే–9 - Sakshi

రైతులకు అందుబాటులో కే–9

- వచ్చే ఖరీఫ్‌లో సబ్సిడీతో పంపణీ
- వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి


అనంతపురం అగ్రికల్చర్‌ : కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన కదిరి–9 (కే–9) విత్తన వేరుశనగను ఖరీఫ్‌–2017లో రాయితీతో రైతులకు అందుబాటులోకి తెస్తున్నట్లు వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. ప్రస్తుత  ఎంపిక చేసిన కొందరు రైతులకు అందజేసి రబీలో ప్రయోగాత్మకంగా పండిస్తున్నామన్నారు.  50 శాతం రాయితీతో జిప్సం, జింక్‌సల్ఫేట్, బోరాన్‌ లాంటి సూక్ష్మపోషకాలు అందజేసి పంట దిగుబడులు బాగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరింఆచరు.   మొత్తం పంట ఉత్పత్తులను సేకరించి ఖరీఫ్‌లో ఎక్కువ మంది రైతులకు విత్తనం పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. వర్షాభావ ప్రాంతమైన  జిల్లాలో బెట్టను తట్టుకుని పంట దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నందున ఖరీఫ్‌లో కొంత మొత్తంలో కే–9 రకపు సాగు విస్తీర్ణం పెంచనున్నట్లు చెప్పారు.

కే–9 రకం వివరాలు..
ఇది ఒక రకంగా తీగరకం వేరుశనగ. ఆకులు చిన్నవిగా, మందంగా, ముదురు ఆకుపచ్చరంగులో ఉంటాయి. అందువల్ల ఎండకు బాగా తట్టుకుంటుంది. రెమ్మలు దళసరిగా ఉంటాయి. ఎండిన తర్వాత కూడా లొత్తగా కాకుండా గట్టిగానే ఉంటుంది. కీలకమైన పూత దశలో కూడా 45 రోజుల వరకు వర్షాలు లేకున్నా బెట్టను తట్టుకుని నిలబడుతుంది. ఆ తర్వాత వర్షానికి వెంటనే తేరుకోగలదు. తెగుళ్లు తట్టుకునే శక్తి ఎక్కువ. ఆకుముడుత, ఆకుమచ్చ తెగుళ్లు సోకే అవకాశం చాలా తక్కువ. తీగరకం మాదిరిగా కాయలు కొమ్మల చివర వరకు ఊడలు దిగి కాస్తాయి. కొమ్మలను ఊడదశలో (40 నుంచి 50 రోజుల్లో) తడికెతో తొక్కి నేలకు దగ్గర చేస్తే దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. ప్రకృతి పరమైన ఇబ్బందుల వల్ల పంట సకాలంలో తీయలేకపోయినా, నిద్రావస్థ దశ ఉన్నందున ముదిరిన కాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ మొలకెత్తవు. తీగరకం కావడంతో రెమ్మలు భూమిపైకి పాకుతాయి. నీటి ఆధారంగా సాగు చేసే ప్రాంతాల్లో ఇరుసాళ్లలో వేయకూడదు. ఎకరాకు 50 నుంచి 60 కిలోల విత్తనం అవసరం. పంట కాలం 120 నుంచి 130 రోజులు. నూనె శాతం కూడా ఎక్కువే. పంట తొలగించేదాకా ఆకులు రాలవు. పశుగ్రాసం బాగా వస్తుంది.

జాగ్రత్తలు:
తీగజాతి వేరుశనగ కావడం, విత్తనం 30 రోజుల పాటు నిద్రావస్థలో ఉంటుంది. దీంతో పంట తొలగించిన వెంటనే అదే విత్తనాన్ని సాగు చేస్తే మొలకశాతం తగ్గిపోతుంది. ఒక వేళ అదే విత్తనాన్ని వేయాలనుకుంటే యంత్రాల్‌ ద్రావణం ద్వారా నిద్రావస్థను తొలగించాలి. ఈ రసాయన ముందు అన్ని చోట్ల లభ్యమవుతుంది. పండ్లను తొందరగా మాగడానికి ఈ మందును వినియోగిస్తారు. 100 కిలోల విత్తనానికి 100 మిల్లిలీటర్ల మందు 200 లీటర్ల నీటికి కలిపి 12 గంటల పాటు డ్రమ్ములో ఉంచాలి. తర్వాత తడి ఆరేవరకు అంటే ఒకట్రెండు గంటలు నీడలో అరబెట్టి విత్తుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement