కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో డైలమా
పంచాయతీల విలీనమే అవరోధం
నేడు స్పష్టత వచ్చే అవకాశం
ఎన్నికల కోడ్ అమలులోకి
కాకినాడ : ఏడేళ్ల తరువాత కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదలై 24 గంటలు గడవకముందే కొత్త సమస్య వచ్చిపడింది. ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్‌లో ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఎస్.అచ్యుతాపురం, గంగనాపల్లి, స్వామినగర్ గ్రామ పంచాయతీల విలీనంపై కొండా అప్పారావు, కోనాల కృష్ణతోపాటు పలువురు స్థానికులు వేసిన పిటీషన్ నేపథ్యంలో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 7వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ల స్వీకరణ జరగాల్సి ఉన్న తరుణంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రాజకీయవర్గాల్లో ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. కోర్టు ఉత్తర్వులు రాత్రి వరకు కూడా బయటకు రాకపోవడంతో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.
ఒకందుకు వెళ్తే...
కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి గతంలో దాఖలైన ప్రజాప్రయోజనాల వాజ్యం, కోర్టు ధిక్కార పిటీషన్లపై న్యాయస్థానం ఎదుట హాజరయ్యేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంఏ, కమిషనర్ అలీంబాషాతోపాటు అనేకమంది అధికారులు వెళ్ళారు. ఓ వైపు ఆ కేసుపై అధికారులు రికార్డులతో సహా కోర్టుముందు హాజరయ్యారు. అదే సమయంలో వేరొక కోర్టులో పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన కోర్టు ఆ మూడు పంచాయతీలను తొలగించి ఎన్నికలకు వెళ్లాలని ఆదేశాలిచ్చినట్టు సంకేతాలందాయి. ఈ ఆదేశాల ప్రకారం మూడు పంచాయతీలను తొలగిస్తే 42 ,48 డివిజన్ల పరిస్థితి డైలమాలోపడే పరిస్థితి నెలకొంది. ఏడవ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సిన నేపథ్యంలో ఆ మూడు పంచాయతీలను తొలగించి ఎలా ఎన్నికలు జరపాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
ఉత్తర్వులు అందక డైలమా
కిందికోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పంచాయతీలను తొలగించి ఎన్నికలకు వెళ్ళాలంటే తిరిగి డివిజన్ల పునర్విభజన చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికలకు ఎలా వెళ్ళాలనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పునర్విభజన చేస్తే రిజర్వేషన్లు కూడా మారే అవకాశం ఉండడంతో ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వాయిదా పడ్డాయంటూ పుకార్లు
ఓ వైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలపై న్యాయస్థానం స్టే ఇచ్చిందంటూ రోజంతా పుకార్లు షికార్లు చేశాయి. కోర్టు ఉత్తర్వులు బయటకు రాకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయని కొందరు, స్టే వచ్చిందని మరికొందరు, రెండువారాలకు వాయిదా అంటూ మరికొందరు పేర్కొనడంతో రోజంతా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ రెండురోజులు మాత్రమే ఉండడం, అధికారికంగా ఎలాంటి సమాచారం రాకపోవడంతో అసలేం జరుగుతుందో తెలియక వివిధ రాజకీయపార్టీల నేతలు తలలు పట్టుకున్నారు.
నేడు స్పష్టత వచ్చే అవకాశం
కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని నగరపాలక సంస్థ అధికారుల సమాచారం. ఈ విషయమై పురపరిపాలనాశాఖ డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సహా కాకినాడ కార్పొరేషన్ కమిషనర్, ఇతర అధికారుల చర్చల అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. శనివారం కోర్టు ఉత్తర్వుల కాపీ కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఆ ఉత్తర్వులను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. మొత్తంమీద కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలపై రోజంతా తీవ్ర ఉత్కంఠ, తర్జన భర్జన చోటు చేసుకుంది.
అమలులో ఎన్నికల కోడ్
ఇదిలా ఉండగా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ నెల 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. కులం, మతం పేరిట ఓట్లు అడగడం, దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ఎన్నికల ప్రచారం చేయడంపై ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలు చేయరాదని స్పష్టం చేసింది. లౌడ్‌స్పీకర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే ఉపయోగించాలని, పోలింగ్ నిర్వహించే 48 గంటల ముందు నుంచి ప్రచారం నిలిపివేయాలని స్పష్టం చేశారు.