-నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
-11న పరిశీలన, 16న ఉపసంహరణ
-29న పోలింగ్, ఒకటిన కౌంటింగ్
కాకినాడ : ఏడేళ్ళ విరామం తరువాత కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు కార్పొరేషన్ యంత్రాంగం సన్నద్ధమైంది. సోమవారం (7వ తేదీ) నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. 7 నుంచి 10 వరకు ఎంపిక చేసిన డివిజన్ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 16న నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 29న పోలింగ్ జరుగుతుంది. ఎక్కడైనా వివాదాలు, సమస్యలు తలెత్తితే ఈ నెల 31న రీపోలింగ్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1న కౌంటింగ్ పూర్తి చేసి, ఫలితాలను ప్రకటించేలా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
అధికారులు సన్నద్ధం..
సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా డివిజన్ కేంద్రాల్లో నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు కమిషనర్ అలీమ్ బాషా ఆదేశాలు జారీ చేశారు.
48 డివిజన్లకే నామినేషన్లు
నగరంలో 50 డివిజన్లకు ప్రస్తుతం 48 డివిజన్లకే ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడు గ్రామ పంచాయతీలపై న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో 42, 48 డివిజన్లకు ఎన్నికలు జరగవు.
తొలిరోజు గ్రహణం ఎఫెక్ట్
తొలిరోజైన సోమవారం చంద్రగ్రహణం కావడంతో అభ్యర్థులు ఎంతవరకు నామినేషన్లు దాఖలు చేస్తారనేది సందేహంగానే కనపిస్తోంది. అయితే స్వతంత్ర అభ్యర్థులుగా కొందరు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి అధికారులు నియమనిబంధనలను ప్రకటించారు.
ఫారం-1 నుంచి ఫారం-8 వరకు..
రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు అందజేసే సమయంలో రిజర్వేషన్లు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2,500, జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5వేలు ధరావత్తుగా చెల్లించాలి. రిజర్వేషన్లకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలు, ఎన్నికల నిబంధనలకు లోబడి ఉంటామన్న అఫిడవిట్లు, ఇతర అంశాలకు సంబంధించిన నిబంధనలతో ఫారం–1 నుంచి ఫారం–8 వరకు సమర్పించాలి.
పార్టీల ముమ్మర కసరత్తు
పోటీ చేసే అభ్యర్థులపై రాజకీయ పార్టీలు కసరత్తును ముమ్మరం చేశాయి. వైఎస్సార్ సీపీ, టీడీపీ పాటు కాంగ్రెస్ కూడా అన్ని స్థానాలకూ పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇందుకనుగుణంగా డివిజన్లలో సమర్థులైన అభ్యర్థుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానపార్టీలు ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నాయి.
ఆర్వోలతో సమీక్ష
నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి కమిషనర్ ఆలీమ్‌బాషా ఆదివారం సాయంత్రం రిటర్నింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ల స్వీకరణ, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు.
నామినేషన్లు స్వీకరించే ప్రాంతాలు
1నుంచి3 ఎంటీఎంసీహెచ్ స్కూల్, గొడారిగుంట జె.సింహాద్రి
4 నుంచి 6 ఎంసీ గరల్స్ హైస్కూల్, శ్రీనగర్ ఎం.వెంకటేశ్వరరావు
7 నుంచి 9 రామకృష్ణ పబ్లిక్‌స్కూల్, శాంతినగర్ కె.భీమేశ్వర్
10 నుంచి 12 ఏఎంజీ స్కూల్, పర్లోపేట బి.సుగుణ
13 నుంచి 15 వీఎంఎంసీ స్కూల్, గౌరీశంకర్‌పేట ఎల్.శివకుమారి
16 నుంచి 18 బీఆర్‌ఆర్‌ఎంసీçహైస్కూల్, చర్చిస్క్వేర్ కె.పద్మావతి
19 నుంచి 21: ఎల్‌ఎంఎన్‌సీ స్కూల్, జె.రామారావుపేట ఎస్.ఎల్.జోసఫ్
22 నుంచి 24 : జీఎంసీబీఎంసీ స్కూల్ అన్నమఘాటీ బి.ఆదినారాయణ
25 నుంచి 27: ఎంసీ బాలుర పాఠశాల, పరదేశమ్మపుపేట వై.జయ
28 నుంచి 30 సీబీఎంస్కూల్ సినిమారోడ్డు, ఎస్.పోతురాజు
31 నుంచి 33: ఆర్‌జీఎంసీ హైస్కూల్, ఆనందభారతి పీవీఎస్‌ఎస్‌ఆర్ శర్మ
34 నుంచి 36: పీర్ బాలికల పాఠశాల బాలాజీచెరువు, పి.విజయభాస్కర్
37 నుంచి 39 : ఎంసీ ప్రైమరీ స్కూల్ రామారావుపేట, పీవీ థామస్
40–41 : ఎంజీఎంసీ హైస్కూల్, గాంధీనగర్ సీహెచ్ కాశీవిశ్వనాథ్
43నుంచి 45: బీజెఆర్‌ఎంసీ స్కూల్ నరన్ననగర్ వి.అబ్రహం లింకన్
46–47 : ఆర్‌పీలైన్ స్కూల్, రిజర్వ్‌లైన్ వెంకటలక్ష్మి
49–50: ఎస్‌ఆర్‌పీ కేఎంఎంసీ స్కూల్, గైగోలుపాడు ఎస్.మధుసూదన్