– 150 ఏళ్ల చరిత్ర గల కాకినాడలో దయనీయ పరిస్థితి
– గుంతలతో అధ్వానంగా మారిన రోడ్లు
– ప్రయాణమంటే హడలిపోతున్న నగర జనం
– ప్యాచ్ వర్క్‌లకే పరిమితం
– నాసిరకం పనులతో నాణ్యతకు తూట్లు
– సుమారు రూ.400 కోట్ల మేర స్మార్ట్‌సిటీ నిధుల కేటాయింపు
– ఏడాదిన్నర దాటుతున్నా ఒక్క అడుగూ పడని దుస్థితి
మంత్రాలకు చింతకాయలు రాలనట్టే.. మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడి మాటలకు గుంతలు మాయం కాలేదు! రోడ్లు భవనాల శాఖ మంత్రి హోదాలో ‘వర్షాకాలం వచ్చే లోపు కాకినాడ రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాన’ని ఆయన ప్రకటించారు. కానీ నేటికీ వాటి అతీగతీ పట్టించుకొనే దిక్కు లేదు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఏది రోడ్డో...ఏది గుంతో తెలియని పరిస్థితి. 150 ఏళ్ల చరిత్ర గల కాకినాడ నగరానికి పట్టిన గతి ఇది. వాహన చోదకులే కాదు పాదచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి. నగర రోడ్లపై ప్రయాణమంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఎక్కడ పడిపోతామో...ఎక్కడ గాయపడతామో...రోడ్డెక్కితే ఏమవుతుందోనని భయపడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. రహదారుల నిర్వహణకు ఏటా రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా అవి ప్యాచ్ వర్క్‌లకే పరిమితమవుతున్నాయి. నిధుల దుర్వినియోగం తప్ప రహదారులకు మోక్షం కలగడం లేదు.
నాసిరకం పనులతో సమస్య
కాకినాడ నగరంలో 875 కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఉన్నాయి. ఇందులో 175 కిలోమీటర్ల రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక మిగిలిన 700 కిలోమీటర్ల రోడ్లలో అత్యధికం దెబ్బతిని ఉన్నాయి. ఒక నగర రోడ్లే కాదు కాకినాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగానే ఉంది. సిటీలోని ఏ డివిజన్‌కు వెళ్లినా రోడ్లపై గుంతలే ఉంటున్నాయి. ఎటువైపు చూసినా గోతుల రోడ్లే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మామిడాడ రోడ్డు, సర్పవరం నుంచి వలసపాకల వైపు రోడ్డు(పూర్తిగా దెబ్బతింది), కాకినాడ–జొన్నాడ మధ్య రోడ్డు...ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. పలు దఫాలుగా గోతులమయమైన రోడ్లకు మరమ్మతులు చేస్తున్నా నాసిరకం నిర్మాణాలతో కొద్ది రోజులకే పాడవుతున్నాయి.
స్మార్ట్ సిటీలోనూ మారని దుస్థితి
కాకినాడ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. నిధులు కేటాయించింది కూడా. వాటిలో కొంతవరకు మంజూరు చేసింది. కానీ, ఆ నిధులతో పనులు చేపడుతున్న దాఖలాల్లేవు. స్మార్ట్‌సిటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.90 కోట్లు కేటాయించారు. మురుగునీటి కాలువలకు అనుసంధానంగా వర్షపు నీరు పోయేందుకు కాలువల నిర్మాణానికి మరో రూ.307 కోట్లు ప్రకటించారు. అయితే ఈ పనులకు ఇంతవరకు ఒక్క అడుగూ పడలేదు. రాజకీయ జోక్యం, అధికారుల్లో కొరవడిన చిత్తశుద్ధితోనే పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అన్నీ చేయాలన్న పరోక్ష ఆదేశాలతో అధికారులు కూడా చొరవ చూపలేకపోతున్నారు. అదే కార్పొరేషన్ పాలకవర్గం ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అభివృద్ధికి అడ్డంకులు ఉండేవి కావు. బయట వ్యక్తుల ప్రభావం ఉండేది కాదు. నగరాభివృద్ధికి దోహదపడే కార్పొరేషన్ పాలకవర్గం రాకుండా ఉంటేనే తమ ఆటలు సాగుతాయని, నచ్చినట్టుగా చేసుకోవచ్చని, దొరికిన కాడికి దోచుకోవచ్చన్న ఉద్దేశంతో ఎన్నికలు నిలిపివేయించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారు. పాలకవర్గం ఏర్పాటైతే తమ హవా సాగదని కుటిల యత్నాలకు దిగుతున్నారు.
వర్షం వస్తే నరకమే
వర్షం వస్తే మురికివాడ ప్రాంతంలో ఎలా ఉన్నా ప్రధాన రహదారులు మరింత అధ్వానంగా తయారవుతున్నాయి. గతుకుల, గుంతల రోడ్లతో ప్రయాణమంటేనే భయపడే పరిస్థితి. నరకం చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా నగరంలో రోడ్లన్నీ పల్లం కావడంతో కొద్దిపాటి వర్షానికే జలమయంగా మారడంతో పాటు డ్రైనేజ్‌లో ఉన్న వ్యర్థాలు రోడ్లపైకి వచ్చి మురికికూపంగా మారుతున్నాయి.
– పి.త్రినా«థ్, సాలిపేట, కాకినాడ
పైపులైన్ విస్తరణతో అధ్వానం..
నగరంలో ఉన్న కొద్దిపాటి రోడ్లను గ్యాస్ పైపులైన్ పేరుతో తవ్వి అధ్వానంగా తయారు చేశారు. వాటిని సక్రమంగా పూడ్చకపోవడంతో ప్రయాణానికి ఇబ్బందిగా ఉంది. నగరంలో ఏదో చోట పైపులైన్లు, కేబుల్ వర్క్‌ల పేరుతో రోడ్లను ఇష్టానుసారంగా తవ్వి నగర వాసులకు ఇబ్బందులు తెస్తున్నారు.
– బోనం మణిబాబు, 22వ డివిజన్, కాకినాడ