బుజ్జగింపులు, నజరానాలు, బెదిరింపులు
- చివరి నిమిషంలో అభ్యర్థుల ఖరారు
సీటు ఖరారైన అభ్యర్థుల పాట్లు
గెలుపు గుర్రాలకు సీట్లు ఇచ్చినట్టు చెబుతున్న అధినేతలు
చెట్టెక్కి కూర్చున్న ఆశావహులు
సాక్షి, కాకినాడ: ప్రధాన రాజకీయ పార్టీల్లో బుజ్జగింపులు, నజరానాలు ప్రారంభమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు నేటితో (ఈ నెల 16వ తేదీ) గడువు ముగియనుండడంతో సీట్లు ఖరారైన అభ్యర్థులు తమతోపాటు పార్టీ నుంచి నామినేషనన్లు వేసిన ఆశావహుల్ని సంప్రదిస్తున్నారు. పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన నేపథ్యంలో నామినేషన్ ఉపసంహరించుకుని తనకు మద్దతుగా నిలవాలని అభ్యర్ధిస్తున్నారు. వారితోపాటు పార్టీ అధినాయకులూ సర్వే ప్రకారం గెలుపు గుర్రాలకు సీట్లు ఇచ్చామని, భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామంటూ నచ్చజెబుతున్నారు. అటు పార్టీ అధినేతలు, ఇటు సీటు ఖరారైన అభ్యర్థులు సంప్రదింపులు జరుపుతున్నా, కొందరు ఆశావహులు చెట్టెక్కి కూర్చుంటున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజల సమస్యలను పరిష్కరించామని, అందుకోసం విలువైన సమయాన్ని, డబ్బును వ్యయపరిచామని, ప్రజలు తమను అభిమానిస్తున్నారని చెబుతున్నారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తామంటున్నారు. భవిష్యత్తు రాజకీయానికి కార్పొరేటర్ పదవి తొలి మెట్టులాంటిదని, అది ఎక్కకపోతే రాజకీయంగా వెనుకబడిపోతామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీటు ఖరారైన అభ్యర్థులు బుజ్జగింపులు, నజరానాలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. చివరి నిమిషంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంతో నామినేషన్లు వేసిన ఆశావహులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. దాదాపు పది మంది అభ్యర్దులు నామినేషనన్లు వేసిన తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో వారిని వెతికి పట్టుకోడానికి ఆభ్యర్ధులు నానా తంటాలు పడుతున్నారు. ఇలా నామినేషన్లు వేసిన అభ్యర్దులను అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉంది..నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే ఇబ్బందులు పడతావ్ అంటూ బెదిరిస్తూ ఇంటికి వెళ్లి వారితో విత్‌డ్రా ఫారాల మీద సంతకాలు చేయించుకుంటున్నారు.
విత్‌డ్రాలకు బేరం...
కాకినాడ కార్పొరేషన్‌కు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. విలీన గ్రామాల సమస్య నేపథ్యంలో ఈ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులు మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం గత 29న నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం అధికార యంత్రాంగం ఈ నెల 7 వరకు నామినేషనున్లు స్వీకరించింది. ప్రధాన రాజకీయ పార్టీలకు అంచనాలకు భిన్నంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం, ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయాన్ని ఇవ్వకపోవడంతో అభ్యర్ధుల ఖరారులో కొంత జాప్యం జరిగింది. నామినేషన్లు స్వీకరణకు గడువు తేదీలోపు (7వ తేదీ) అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆశావహకులంతా నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 48 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుంటే 589 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 50 శాతం రిజర్వేషన్ కలిగిన మహిళలు 280 మంది ఉన్నారు. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు ఇప్పటి వరకు 35, 9 సీట్లను పంచుకునేందుకు ఏకాభిప్రాయానికి వచ్చాయి. టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసినా... అందరి నుంచీ విత్‌డ్రా ఫారాలపై సంతకాలు చేయించుకుని తీసుకుంది. వీరిలో సీటు ఖరారైన అభ్యర్థికి బీపారం ఇచ్చి మిగిలిన అభ్యర్థులు విత్‌డ్రా ఫారాలు అధికార యంత్రాంగానికి అందజేసే వ్యూహంలో ఉంది. అయితే సీటు ఖరారైన అభ్యర్థులు విత్‌డ్రా చేసుకునే ఆశావహులకు వారి స్థాయిని బట్టి రూ.50 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు చెల్లించడానికి లోపాయికారీగా ఒప్పందాలు ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
బీజేపీలో మరోలా...
బీజేపీలోని ఒక డివిజన్‌కు చెందిన అభ్యర్థి అదే పార్టీలో మరో అభ్యర్థికి ఇంకో డివిజన్ నుంచి పోటీ చేయడానికి అనువుగా సీటు ఇప్పించాడు. దీనికి ప్రతిఫలంగా తన డివిజన్‌లో ఎన్నికల ఖర్చు మొత్తం భరించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 26 డివిజన్లలో బీజేపీ ఆశావహకులు నామినేషన్లు వేస్తే పొత్తులో ఆ పార్టీకి 9 డివిజన్లు లభించాయి. అయితే 26వ డివిజన్లకు బీజేపీ ఆశావహులు నామినేషన్లు వేయడంతో టీడీపీ, బీజేపీల్లో సీటు ఖరారైన అభ్యర్దులు మిగిలిన వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు.