ఖర్చు పెట్టాలా... వద్దా?
–గందరగోళంలో అభ్యర్థులు
– భయపెడుతున్న కోర్టు తీర్పు
– ఆగిపోతే ఖర్చు అంతా వృధా
– ఖర్చు చేయని పక్షంలో ఎన్నిక జరిగితే ఓడిపోతామేమోనని అభద్రతా భావం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికలపై అనుకున్నట్టుగా బుధవారం తీర్పు రాలేదు. గురువారమో...శుక్రవారమో...తీర్పు ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ...పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం భయాందోళన చెందుతున్నారు. ఎన్నికలంటేనే ఖర్చు. ఇప్పుడా ఖర్చు చేయాలా? వద్దా? అనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఖర్చు పెట్టాక ఎన్నికలు ఆగిపోతే నష్టపోతామని..అలాఅని ఖర్చు పెట్టని పక్షంలో ఎన్నికలు జరిగితే ఓడిపోతామోనన్న భయం పట్టుకుంది. ఇప్పుడేం చేయాలా? అని అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు.
కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు జరుగుతున్న 48 డివిజన్లకుగాను.........మంది బరిలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పక్షాలతోపాటు అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. వీరంతా ఎన్నికల కథన రంగంలోకి దూకాల్సిందే. ప్రచారాలతోపాటు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు పదును పెట్టాలి. దాదాపు ప్రతి దానికీ ఖర్చు పెడితే గానీ పని జరగదు. ప్రచారం స్వీకారం చుట్టిన దగ్గరి నుంచి ఎన్నికలయ్యేంతవరకూ అభ్యర్థులకు ఖర్చు తప్పదు. ఇదంతా సాధారణమే. ఎన్నికల్లో గెలిచేవాడు సంతోషిస్తాడు. ఓడిపోయినోడు సొమ్ముపోయింది, పదవి పోయిందని బాధపడతాడు. కానీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో ఆ క్లారిటీ లేదు. దీనికంతటికీ హైకోర్టులో నడుస్తున్న ప్రజా వ్యాజ్యాలే కారణం.
తీర్పులో ఏముందో...
డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్లు సరిగా లేదని, ఎన్నికలను నిలిపివేయాలని టీడీపీ నేతల అనుయాయులు పిటీషన్లు వేశారు. ఆ పిటీషన్లపై ఇప్పటికే వాదనలు కూడా ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. బుధవారం వెల్లడిస్తామని ఈ నెల 10వ తేదీన పేర్కొంది. కానీ...అనుకున్నట్టుగా బుధవారం తీర్పు రాలేదు. ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. ఈలోపే (బుధవారం) నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. బరిలో ఉన్నదెవరో తేలిపోయింది. ఇకపై ఎన్నికలపైనే అభ్యర్థులు దృష్టి సారించాల్సి ఉంది. ఎన్నికల నిబంధనలకు లోబడి ఎవరి స్థాయి ప్రకారం వారు ఖర్చు పెట్టుకుని సిద్ధమవుతారు. ప్రచారాల జోరు పెంచనున్నారు. ఓట్ల కోసం రకరకాల జిమ్మిక్కులు ప్రదర్శించనున్నారు. వాటి కోసం ఎంతో కొంత ఖర్చు పెట్టనున్నారు. ఇవన్నీ జరిగితే తప్ప ఎన్నికల్లో గట్టెక్కే అవకాశం లేదు. గెలుపోటములు పక్కన పెడితే ఎన్నికల ప్రహసనం ముగియనుంది. అయితే అంత స్వేచ్ఛగా అభ్యర్థులు ముందుకెళ్లేందుకు రిజర్వులో ఉన్న కోర్టు తీర్పు ముందరి కాళ్లకు బంధంలా నిలిచింది.
ఖర్చుల విషయంలో మల్లగుల్లాలు...
బుధవారం వెలువడుతుందనుకున్న కోర్టు తీర్పు రాలేదు. ఈ రోజు వచ్చేస్తే అభ్యర్థులకు క్లారిటీ వచ్చేసిది. స్వేచ్ఛగా ముందుకెళ్లేవారు. కానీ హైకోర్టు తీర్పు రాలేదు. ఎప్పుడొస్తుందో స్పష్టత లేదు. ఎన్నికలు జరిగిపోతాయని వెళ్లిపోతే అందుకు భిన్నంగా కోర్టు తీర్పు వస్తే చేసిన ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అలా అని ఖర్చు చేయకుండా తాత్సారం చేస్తే ఎన్నికల కొనసాగింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే...తాము అసలుకు నష్టపోక తప్పదన్న భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఏమి చేయాలన్న దానిపై అభ్యర్థులంతా మల్లగుల్లాలు పడుతున్నారు. ఖర్చుల విషయంలో ఆచీతూచీ వ్యవహరించాలన్న అభిప్రాయంతో ఉన్నారు. మొత్తానికి కోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియదు గాని అభ్యర్థులు మాత్రం గందరగోళంలో ఉన్నారు.