కళకళా గోదారి
కళకళా గోదారి
Published Sat, Aug 6 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
పావన వాహిని పరవళ్లు.. భక్తజన కేరింతలు.. కలగలసి గోదారమ్మ తీరం కళకళలాడింది. వెతలు తీర్చే దేవేరి.. వేదమంటి జీవధార‡ చెంతకు వారాంతాన యాత్రికులు పోటెత్తారు. పుణ్యస్నానమాచరించి పులకించారు. తన్మయత్వంలో మునిగారు. పసుపు, కుంకుమతో గంగమ్మను అర్చించారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి తీరం శనివారం భక్తజన సందోహంతో నిండిపోయింది. అంత్యపుష్కరాల ఏడోరోజు భారీ సంఖ్యలో యాత్రికులు తరలివచ్చారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 65వేల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు అంచనా. తెల్లవారుజామునుంచే అన్ని ఘాట్లలోనూ రద్దీ నెలకొంది. గోదారి తీరాన భక్తులు ప్రణమిల్లారు. పసుపు, కుంకుమలతో గంగమ్మను అభిషేకించారు. పూర్వీకులకు పిండప్రదాన క్రతువులు నిర్వహించారు. గత ఏడురోజులుగా కొవ్వూరులో సుమారు లక్షన్నర మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని అంచనా. ఒక్క శనివారమే 32 వేల మంది స్నానం చేశారని సమాచారం. శనివారం నరసాపురంలోనూ భక్తులు పోటెత్తారు. వలంధర్‌రేవులో మధ్యాహ్నం వరకూ భక్తుల రద్దీ తగ్గలేదు. శ్రావణమాసం రెండో రోజు కావడంతో యాత్రికుల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. నరసాపురంలో సుమారు 20 వేల మందిపైనే స్నానాలు చేశారని అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా వలంధర్‌రేవులో ఏర్పాటు చేసిన జల్లుస్నానం చేయడానికి భక్తులు ఎక్కువ ఆసక్తి కనబరిచారు. గోదావరి వరద తీవ్రత కాస్త తగ్గడంతో కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోని మొదటి, రెండు ఘాట్లలోనూ స్నానాలకు అధికారులు అనుమతించారు. శుక్రవారం వరద ఉధృతంగా ఉండడం వల్ల ఆ రేవులను మూసివేసిన సంగతి తెలిసిందే. వరద సమయంలో చేసిన రక్షణ ఏర్పాట్లను సడలించకపోవడంతో మెట్లపై తగిన నీరు లేక స్నానాలకు భక్తులు అవస్థలు పడ్డారు. అంత్యపుష్కరాల సందర్భంగా పలుచోట్ల గోదావరి మాతకు నిత్యహారతులు ఇస్తున్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో గోదావరి నీరాజన సమితి ఆధ్వర్యంలో పూజలు చేశారు. పట్టిసీమలో గోదావరి మాతకు గంగ పూజలు నిర్వహించారు.
Advertisement