
కాపు ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లండి
వైఎస్ జగన్‌కు కాపు సంఘం నేతల విజ్ఞప్తి
సాక్షి, విజయవాడ: ‘కాపు ఉద్యమాన్ని మీకున్న విస్తృత రాజకీయ పరిచయాలతో జాతీయ స్థాయికి తీసుకెళ్లి మా సమస్యల్ని పరిష్కరించండి..’ అని కాపు జాయింట్ యాక్షన్ కమిటీ, కాపు సంఘం నేతలు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. మంగళవారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాపు సంఘం నేతలు పెద్ద సంఖ్యలో వచ్చి వైఎస్ జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. కొద్దిసేపు సమస్యలపై చర్చించారు. కాపు జాతి కోసం ముద్రగడ చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆరు రోజులుగా ముద్రగడ కుటుంబం ఆమరణదీక్ష చేస్తున్న క్రమంలో ఉద్యమం ఉద్ధృతమైందని, దీనికి రాష్ట్ర స్థాయిలో ఇతర పార్టీలతో పాటు వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను సమాయత్తం చేసి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం వైఎస్ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన వైఎస్ జగన్ మాట్లాడుతూ కాపులకు ఇప్పటికే మద్దతు తెలిపి సహకరించానని చెప్పారు. కాపునాడు నేత గోళ్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇప్పటికే కాపు ఉద్యమం తీవ్రమైందని, కాపుల కోసం జగన్ ఒకరోజు దీక్ష చేసి సంఘీభావం ప్రకటించాలని కోరారు.