'దాసరి, చిరంజీవితో అందుకే కలిశాం'
హైదరాబాద్: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.
నా శవాన్ని తీసుకెళ్లండని ముద్రగడ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తోందో ఈ మాటలను బట్టే అర్థమవుతోందన్నారు. ముద్రగడను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హామీలు నెరవేరుస్తారనే ఉద్దేశంతోనే ప్రకటనలకు పరిమితం అయ్యామని చెప్పారు. తాము సంయమనం పాటిస్తుంటే, చంద్రబాబు సర్కారు రెచ్చగొడుతోందని ఆరోపించారు. కాపులకు ఇచ్చిన నెరవేర్చకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.
కులతత్వం కోసమే చిరంజీవి, దాసరి నారాయణరావుతో కలిశారన్న ఆరోపణలను అంబటి రాంబాబు తోసిపుచ్చారు. మా కులాన్ని అణగతొక్కుతుంటే ప్రతిఘటించే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. తన కులానికి అపాయం కలిగినప్పుడు సహాయం చేయలేని వాడు పక్క కులానికి ఏం చేస్తాడని అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ముద్రగడ దీక్ష విరమింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.