అందరి భాగస్వామ్యంతో ఉద్యమం ఉధృతం
- కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
- ఎన్నికల హామీ ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి
- పోరుబాటలో మహిళల భాగసామ్యం అవసరమని పిలుపు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని అందరి భాగస్వామ్యంతో మరింత ఉధృతం చేయాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యాన స్థానిక సినిమా రోడ్డులోని పద్మనాభ ఫంక‌్షన్ హాలులో బలిజ, తెలగ, ఒంటరి, కాపు రిజర్వేషన్లపై ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం కాపు ఉద్యమాన్ని చులకనగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేర్చేంతవరకూ నిద్రపోయేది లేదని అన్నారు. కాపులకు, బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తగాదాలు పెడుతున్నారని ఆరోపించారు. బీసీల రిజర్వేషన్లలో తమకు వాటా వద్దని, జిల్లాతోపాటు రాష్ట్రంలోని పలువురు బీసీ నాయకులను కలిసి ఈ విషయాన్ని స్పష్టం చేశామని చెప్పారు. కాపులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, కాపులు ఎటువైపు ఉంటే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ముద్రగడ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేంతవరకూ ముద్రగడ తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, తామంతా ఆయన వెంటే ఉంటామని అన్నారు. సినీ నటి హేమ మాట్లాడుతూ, రిజర్వేషన్లు లేకపోవడంతో కాపులు అన్నివిధాలా నష్టపోతున్నారన్నారు. ‘‘మన పిల్లల కోసం ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఉద్యమంలో పాల్గొనాలి’’ అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేర్చేంత వరకూ ముద్రగడ చేసే ప్రతి ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఉద్యమం బలోపేతానికి మండలాలవారీగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు కార్యాచరణ రూపొందించనున్నామని తెలిపారు. సమావేశంలో కాపు జేఏసీ నేతలు వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ, మలకల చంటిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, ఇతర నాయకులు పసుపులేటి చంద్రశేఖర్, కొప్పన మోహనరావు, 13 జిల్లాలకు చెందిన జేఏసీ నాయకులు పాల్గొన్నారు.