♦ నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే
♦ 20 నుంచి 50 భాగాలుగా రోడ్ల విభజన
♦ నేటి వర్క్‌షాప్‌లో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్‌లో రహదారుల దుస్థితి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏటా మరమ్మతుల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. ఈ అవస్థలను ఇటీవలే గవర్నర్ నరసింహన్, మునిసిపల్ మంత్రి కేటీఆర్‌లు కూడా వీక్షిం చారు. వివిధ ప్రభుత్వ శాఖల నడుమ సమన్వ య లేమి, పనుల నాణ్యతపై శ్రద్ధ లోపించడం, ఎప్పుడు పడితే అప్పుడు .. ఎక్కడ పడితే అక్క డ తవ్వకాలు తదితరమైనవి ఇందుకు కారణాలని కేటీఆర్ గుర్తించారు. నగర రోడ్లను బాగు చేసేందుకు అవసరమైతే కొత్త విధానాల్ని అవలంభిస్తామని ఆరోజే ప్రకటించారు. వివిధ విభాగాల అధికారులు, నిపుణులతో గురువా రం జరుగనున్న వర్క్‌షాప్‌లో అన్ని అంశాలు పరిశీలించి ఈమేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇందులో భాగంగా నగరంలో రోడ్ల నిర్వహణను రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్లకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రతిపాదనలు గతంలోనూ వచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. గతంలో కృష్ణబాబు కమిషనర్‌గా ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణను ప్రయోగాత్మకంగా ప్రైవేట్‌కు అప్పగించాలని భావించారు. కానీ అమలు కాలేదు. రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్లకే డిఫెక్ట్ లయబిలిటీ కింద రెండేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలుండాల్సినప్పటికీ పట్టించుకోవడం లేరు. బీటీ రోడ్లు వర్షానికి నిలవవు కనుక ఏమీ చేయలేమని తప్పించుకుంటున్నారు. ఈపరిస్థితి నివారణకు ఐదు, పది, పదిహేనేళ్ల వరకు రోడ్ల నిర్వహణను కాంట్రాక్టర్లకే అప్పగించే ఆలోచనలున్నట్లు తెలుస్తోంది.
కేరళ రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానంతో మంచి ఫలితాలున్నట్లు గుర్తించారు. అక్కడ కొన్ని రోడ్లను ప్రైవేటు నిర్వహణకిచ్చారు. వాటితో మంచి ఫలితాలు కనిపించడంతో గ్రేటర్‌లోనూ ఆవిధానాన్ని అమలు చేసే దిశగా యోచిస్తున్నారు. నగరంలో దాదాపు 9 వేల కి.మీ.లమేర రహదారులున్నాయి. 625 చ.కి.మీ.ల విస్తీర్ణంలోని నగరాన్ని 20 నుంచి 50 యూనిట్ల వరకు విభజించి ఒక్కో యూనిట్ వంతున రోడ్ల నిర్వహణను కాంట్రాక్టుకిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వేసే రోడ్డు బీటీయా, సీసీయా, వైట్‌టాపింగా అన్నదాంతో సంబంధం లేకుండా సాఫీ ప్రయాణానికి మన్నికగా ఉండే రోడ్లను నిర్మించే సంస్థ నిర్ణీత కాలవ్యవధి వరకు నిర్వహణ బాధ్యత వహించాలి. గడువు ముగిసేంత వరకు రోడ్ల నిర్వహణ పూర్తి బాధ్యత వారికే అప్పగిస్తారు.