వందన
సంతకవిటి: మండల కేంద్రంలో బుధవారం కిడ్నాప్ కలకలం చెలరేగింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అదృశ్యం కావడం..తరువాత శ్రీకాకుళంలో ప్రత్యక్షం కావడం ఆందోళనకు దారితీసింది. అదృశ్యమై శ్రీకాకుళంలో ప్రత్యక్షమైన విద్యార్థులు తాము కిడ్నాప్‌కు గురయ్యామని తల్లిదండ్రులకు చెప్పడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే... గరికిపాడు గ్రామానికి చెందిన కిల్లారి వందన, మజ్జి రాజులు సంతకవిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఉదయం ఇంటర్వల్ సమయంలో వీరు బస్ పాసుల లామినేషన్ చేయించేందుకు సంతకవిటిలోని ఓ జిరాక్స్ షాపు వద్దకు వెళ్లి వస్తుండగా అదృశ్యమయ్యారు. మధ్యాహ్నం భోజన సమయంలో వీరు పాఠశాలలో లేకపోవడంతో హెచ్‌ఎం ఎ.త్రినాధరావు ఆరా తీశారు. తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. ఈలోగా సాయంత్రం 4.30 గంటల సమయంలో కిడ్నాప్‌కు గురైనట్టు హెచ్‌ఎం, తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. సమాచారం తెలుసుకున్న హెచ్‌ఎం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరా తీసిన పోలీసులు ఈ విషయాని సున్నితంగా తోసిపుచ్చారు.
తల్లిదండ్రులు చెప్పిన వివరాలు...
అదృశ్యమైన విద్యార్థుల్లో కిల్లారి వందన తండ్రి ధర్మారావు సాక్షితో మాట్లాడుతూ తమ కుమార్తెతో పాటు మరో విద్యార్థిని మజ్జి రాజులు ఎప్పట్టిలాగే బుధవారం ఉదయం సంతకవిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్ళారని, సాయంత్రం నాలుగు గంటలు సమయంలో తమ కుమార్తె ఫోన్ చేసిందని, తాను శ్రీకాకుళంలో పెదనాన్న ఇంటి వద్ద ఉన్నానని ఏడుస్తూ చెప్పినట్లు తెలిపారు. తనతో పాటు మజ్జి రాజు సంతకవిటిలో తమ బస్‌పాస్‌లు లామినేషన్ చేయించేందుకు వెళ్లగా తెల్లటి కారులో నలుగురు వ్యక్తులు తమను కారులోకి లాగేసి చేతులు కట్టేయడంతో పాటు నోటికి ప్లాస్టర్లు అంటించారని, శ్రీకాకుళం తీసుకెళ్తుండగా శ్రీకాకుళం దగ్గర్లో టోల్ ఫ్రీ గేటు వద్ద రోడ్డుపై పోలీసులు చెక్ చేసిన సమయంలో వదిలి వేసినట్లు తెలిపారని చెప్పారు. వీరు తనసోదరుడైన కిల్లారి సీతారాం ఇంటి వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఫోన్ చేసినట్లు పేర్కొన్నాడు. ఈ విషయంపై సంతకవిటి పోలీస్‌స్టేషన్ హెచ్‌సీ చంద్రినాయుడు వద్ద సాక్షి ప్రస్తావించగా విద్యార్థులు కిడ్నాప్‌కు గురైన విషయాన్ని తాము పరిశీలనలోకి తీసుకున్నప్పటకీ పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. హైవేలో చెక్ చేసిన సమయంలో వీరు దొరికితే స్టేషన్‌కు అప్పగిస్తారని, తమకు సమాచారం అందిస్తారని, అటువంటి సమాచారం జిల్లాలో ఎక్కడా లేదని పేర్కొన్నారు.