
వాట్సాప్‌ద్వారా వీడియో పంపిన కిడ్నాపర్లు
కిడ్నాప్.. చేశాం.. రూ. 3 లక్షలు ఇచ్చి విడిపించుకుపోండి.. అంటూ వాట్సప్ ద్వారా చేనేత మగ్గాల నిర్వాహకుడి....
► చేనేత మగ్గాల నిర్వాహకుడి కిడ్నాప్
► రూ.3లక్షలిచ్చి విడిపించుకుపోండి..
► కిడ్నాప్ కలకలం.. పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ధర్మవరం : కిడ్నాప్.. చేశాం.. రూ. 3 లక్షలు ఇచ్చి విడిపించుకుపోండి.. అంటూ వాట్సప్ ద్వారా చేనేత మగ్గాల నిర్వాహకుడి కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపారు దుండగులు. ఈ ఘటనతో ధర్మవరంలో ఆదివారం రాత్రి కలకలం రేగింది. పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు... పట్టణంలోని శారదానగర్‌కు చెందిన జింకా రామాంజనేయులు అనే వ్యక్తి అదే కాలనీలో 8 మగ్గాలు నిర్వహిస్తున్నాడు. అయితే శనివారం సాయంత్రం ఇంట్లోకి బియ్యం తీసుకొస్తానని బయటికి వెళ్లిన సదరు వ్యక్తి ఆదివారం సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా మదనపల్లిలో నివాసముంటున్న రామాంజనేయులు సోదరి నాగజ్యోతి సెల్‌కు వాట్సప్ ద్వారా ఒక వీడియో అందింది.
అందులో రామాంజనేయులు మాట్లాడకుండా నోటికి గుడ్డ కట్టి, రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఉంచినట్లు ఉంది. ‘మీ అన్నను కిడ్నాప్ చేశాం. రూ. 3 లక్షలు ఇచ్చి విడిపించుకుపోండి’ అని వాట్సప్ ద్వారా మెసేజ్ చేశారు. ఈ వీడియోను చూసిన ఆమె వెంటనే విషయం ధర్మవరంలో ఉన్న రామాంజనేయులు భార్య లక్ష్మిదేవికి తెలిపింది.
దీంతో భయాందోళనకు గురైన ఆమె తన కుటుంబ సభ్యులతో కలసి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్తను బంధించి దుండగులు పంపిన వీడియోను పోలీసులకు అందజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.