వివాహిత రాధిక కిడ్నాప్ కేసు దర్యాప్తును రాజేంద్రనగర్ పోలీసులు వేగవంతం చేశారు.
అత్తాపూర్ (హైదరాబాద్) : వివాహిత రాధిక కిడ్నాప్ కేసు దర్యాప్తును రాజేంద్రనగర్ పోలీసులు వేగవంతం చేశారు. ఈనెల 6 వ తేదీన అదృశ్యమైన రాధికను రూ.3 లక్షలు ఇవ్వకపోతే ముంబైలో అమ్మేస్తానని దుండుగుడు చేసిన వాట్సాప్ కాలింగ్ ఆధారంగా ఏ ప్రాంతంలో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సెల్ ఫోన్ స్నిగ్నల్స్ ఆధారంగా నిందితుడు ఒడిశాలో ఉన్నట్లుగా గుర్తించారు. బాధితురాలిని రక్షించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆదివారం ఉదయం ఎస్ఓటీ పోలీసు బృందాలు విమానంలో ఒడిశాకు బయలుదేరాయి.
కాగా ఈనెల 6న గుడికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన రాధికను కిడ్నాప్ చేసిన దుండగుడు వాట్సాప్ ద్వారా ఆమె భర్తను రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితురాలి భర్తకు డబ్బు డిపాజిట్ చేయమని ఇచ్చిన బ్యాంక్ ఖాతా ఆధారంగా అతను భవానీనగర్‌కు చెందిన మహమ్మద్ అజర్‌ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. అయితే, ఆ చిరునామాకు వెళ్లి విచారించగా ఆ పేరుతో ఎవరూ లేరని తెలిసింది. కాగా రాధికను నిర్బంధించిన దుండగుడు ఆమె శరీరం నుంచి రక్తం కారుతున్న చిత్రాన్ని వాట్సాప్‌లో పంపడం కలకలం సృష్టించింది.